Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీసభ్యులు కొండమడుగు నర్సింహ
నవతెలంగాణ-భువనగిరిరూరల్
కాలేశ్వరం పరిధిలోని బస్వాపురం (నృసింహా) ప్రాజెక్టు నుండి నారాయణపురం వరకు సాగు,తాగు నీళ్లు పోవడానికి ముత్తిరెడ్డిగూడెం రైతుల పొలాల నుండి తీసిన కాళ్లపైన రైతులు, వృత్తిదారులు తమపోలాదగ్గరకు వెల్లడానికి బ్రిడ్జి నిర్మాణం వెంటనే చేపట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీసభ్యులు కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం మండలపరిధిలోని ముత్తిరెడ్డిగూడెంలో సీపీఐ(ఎం) గ్రామ శాఖ ఆధ్వర్యంలో కాలువపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని బాధిత రైతులతో, వృత్తిదారులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం మీదుగా బస్వాపురం రిజర్వాయర్ నుండి నారాయణపురం వరకు నీళ్లు పోవడానికి తీసిన కాలువలో భూములు కోల్పోయిన రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.కానీ మరోపక్క కాలువ అవతిలి భాగంలో 150 మంది పైగా ఉన్న రైతులు సుమారుగా 450 ఎకరాల భూమి సాగు చేసుకోవడానికి తమ పొలాలకు పోకుండా, ప్రభుత్వానికి చెందిన 500 ఎకరాలకు పైగా ఉన్న గుట్టల భూమిలోకి గొర్రెల,మేకల కాపర్లు, పాడి రైతులు తమ గొర్రెలను, మేకలను, ఆవులను, గేదెలను తోలుకపోయి మేపుకొని కుటుంబాలను పోషించుకోకుండా, మత్స్య కార్మికులు తమ సొంత భూమిలో ఉన్న కుంటల్లో చేపలను పెంచుకుని పట్టుకోకుండా లోతైన, వెడల్పైన కాలువలు తీసి బ్రిడ్జి నిర్మాణం చేయకుండా రైతాంగాన్ని, వృత్తిదారులను, గొర్రెల, మేకల పెంపకం దారులను,పాడి రైతులను అధికారులు,పాలకులు మోసం చేస్తున్నారని విమర్శించారు.ఆనాడు రైతు పొలాల నుండి కాల్వ తీస్తున్నప్పుడు ప్రాజెక్టు అధికారులు, జిల్లా ఇరిగేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు కాలువల పైన బ్రిడ్జి నిర్మాణం చేపడతామని మాయమాటలు చెప్పి నేడు కాలువ తీసి ఐదేండ్లు గడుస్తున్నా ఎందుకు బ్రిడ్జి నిర్మాణం చేపట్టలేదని ప్రశ్నించారు.రైతులు, వృత్తిదారులు పలుమార్లు జిల్లాస్థాయి అధికారులను, స్థానిక ఎమ్మెల్యేను కలిసి బ్రిడ్జి నిర్మాణం కోసం అనేక సార్లు దరఖాస్తు పెట్టుకున్నా ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు.ఇప్పుడేమో కాలువ దాటడానికి ఉన్న మట్టిని తొలగిస్తామని ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాలుపైన బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోతే ప్రాజెక్టు పనులను అడ్డుకుంటామని, స్థానిక ప్రజాప్రతినిధుల, ఎమ్మెల్యే ఇండ్ల ముందు నిరసనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు కొండఅశోక్, గ్రామ శాఖ కార్యదర్శి కూకుట్ల కృష్ణ, గ్రామ రైతులు కొండ నందు, గజ్జి మల్లయ్య, యాదగిరి, గజ్జి ఐలయ్య, గజ్జికిరణ్, గుడ్డెలుగుల శివయ్య, కన్నెబోయిన గంగరాజు, ఎడ్ల కిష్టయ్య,ఏశమేని నర్సింహ, ఏశమేని పాండు, మాటూరిరామచంద్రం, ఎడ్లసాయమ్మ, రాజు, నాగరాజు, బాలనర్సింహ, వెంకటయ్య, వీరేశం, శ్రీను,అంజయ్య, మల్లేశం, లక్ష్మయ్య, లింగయ్య, కుమార్, చంద్రమౌళి, మహేష్ పాల్గొన్నారు.