Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీ శ్రేణులు ఎవరైన ఆ పని చేస్తే తీవ్ర పరిణామాలు
- ఎమ్మెల్యే నంతకం పెడితేనే కల్యాణలక్ష్మి
- తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
నవతెలంగాణ-మోత్కూరు
పేదింటి ఆడబిడ్డల వివాహానికి ఆర్థిక చేయూత ఇవ్వాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకం ప్రవేశపెట్టారని, కల్యాణలక్ష్మి మంజూరు చేయిస్తామని ఎవరైనా లంచం అడిగితే తన దృష్టికి తేవాలని, ఆడబిడ్డల సొమ్ము ఎవరు తిన్నా పురుగులు పడి పోతారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ వ్యాఖ్యానించారు. కల్యాణలక్ష్మి, షాదీముబాకర్ పథకంలో 48 మంది లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్యాణలక్ష్మి పథకం ఇప్పిస్తామని ఒక్కో లబ్దిదారు నుంచి రూ.5 వేలు తీసుకుంటున్నట్టు తన దృష్టికి వచ్చిందంటూ ఆయన పై విధంగా స్పందించారు. కల్యాణలక్ష్మి పథకం కోసం ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఎమ్మెల్యేనైన తాను సంతకం పెడితేనే పథకంలో డబ్బులు వస్తాయని, ఎవరైన లంచం అడిగితే తన దృష్టికి తేవాలని, పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎవరైనా డబ్బులు తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ ప్రభుత్వం పేదలకు మేలు చేయాలన్న సంకల్పంతో అమలు చేస్తున్న పథకాలకు చెడ్డపేరు తేకుండా రియల్ ఎస్టేట్ లాంటి ఇతర బిజినెస్ లు చేసుకోవాలని సూచించారు. దేశంలో పేదింటి ఆడబిడ్డల వివాహం కోసం ప్రభుత్వం రూ.లక్షా 116 ఆర్థిక సాయం అందజేస్తున్న రాష్ట్రం తెలంగాణ తప్పితే మరో రాష్ట్రం లేదన్నారు. రూ.2 వేలు, 3వేల పింఛన్, 24 గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా, దళిత బంధు లాంటి పథకాలు తెలంగాణలో తప్పితే మరే రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ కు ప్రజలు అండగా నిలవాలని కోరారు.
మానసిక ఒత్తిడి తగ్గించేందుకు క్రీడలు దోహదం
మానసిక ఒత్తిడి తగ్గించేందుకు క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని, విద్యార్థులు, యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో గాంధీనగర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి క్రీడోత్సవాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. నేటి జీవన విధానంలో ప్రతి ఒక్కరు. శరీర ధారుడ్యానికి ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు. గ్రామీణ క్రీడాకారులు ప్రతిభ వెలుగులోకి రావడానికి ఇలాంటి క్రీడా పోటీలు ఎంతో దోహదపడ తాయన్నారు. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మెన్్ కంచర్లరామకృష్ణారెడ్డి, ఎంపీపీ రచ్చ కల్పనలక్ష్మీ నర్సింహారెడ్డి, జడ్పీటీసీ గోరుపల్లి శారదనంతోష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తీపిరెడ్డి సావిత్రిమేఘారెడ్డి, మార్కెట్ చైర్మన్ కొణతం యాకూబ్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ కంచర్ల అశోక్ రెడ్డి, వైస్ ఎంపీపీ బుశిపాక లక్ష్మీ, రైతుబంధు మండల కోఆర్డినేటర్ కొండా సోంమల్లు, మదర్ డెయిరీ డైరెక్టర్ రచ్చ లక్ష్మీ నర్సింహారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు గోరుపల్లి సంతోష్ రెడ్డి, మార్కెట్ మాజీ చైర్మన్లు టి.మేఘారెడ్డి, చిప్పలపల్లి మహేందర్ నాథ్, బీఆర్ఎస్ మండల, మున్సిపాలిటీ అధ్యక్షులుపొన్నెబోయిన రమేష్, బొడ్డుపల్లి కల్యాణ్ చక్రవర్తి, ప్రధాన కార్యదర్శి గజ్జి మల్లేష్, మాజీ ఎంపీటీసీ జంగ శ్రీనివాస్, తహసీల్దార్ షేక్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.