Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూ నిర్వాసితుల కమిటీి, వ్యవసాయ కార్మిక సంఘం పిలుపు
నవతెలంగాణ -భువనగిరిరూరల్
బస్వాపురం ప్రాజెక్టులో ముంపునకు గురవుతూ సర్వం కోల్పోతున్న బిఎన్ తిమ్మాపురం గ్రామ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నేడు నిర్వహించే పాదయాత్రను, 48గంటల ధర్నాను జయప్రదం చేయాలని భూనిర్వాసితుల కమిటీ, వ్యవసాయ కార్మిక సంఘం కమిటీ సంయుక్తంగా పిలుపునిచ్చారు. గురువారం బిఎన్ తిమ్మాపురం భూ నిర్వాసితులు ప్రభుత్వ వైఖరికి నిరసనగా తమ కండ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర , 48 గంటల మహా ధర్నా, వంటావార్పు, రాత్రి బస కార్యక్రమంలో తిమ్మాపురం గ్రామ నిర్వాసితులతో పాటు జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు వివిధ సంఘాలు కవులు కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా సీపీిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు పాల్గొని మాట్లాడుతూ తిమ్మాపూర్ నిర్వాసితులు న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత 52 రోజులుగా దీక్షలు చేస్తుంటే ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు పిలిచి నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చేయాలని నిర్వాసితుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు సీపీఐ సంపూర్ణ మద్దతు తెలియజేసి పోరాటంలో పాల్గొంటామని అన్నారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు పిలిచి భూములకు పాత అవార్డును తొలగించి 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని, ఇండ్లు ,స్థలాలు కోల్పోతున్న వారందరికీ 250 గజాల ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని,గ్రామ సర్వేలో పాల్గొన్న కుటుంబంలోని ప్రతి సభ్యుడుకి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని, జీవనాపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారందరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలని డిమాండ్చేశారు. ఈ నెల 20, 21 తేదీల్లో కలెక్టరేట్ ముందు జరుగుతున్న ఆందోళనలో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేసి నిర్వాసితులకు అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పిన్నం లతా రాజు, ఎంపిటిసి ఉడత శారద ఆంజనేయులు యాదవ్, గ్రామ ఉపసర్పంచ్ ఎడ్ల దర్శన్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏశాల అశోక్, గ్రామ మాజీ సర్పంచ్ రావుల అనురాధ నందు, డొంకన ప్రభాకర్, హై స్కూల్ చైర్మన్ ఉడుత మహేందర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు కొండాపురం యాదగిరి, మండల అధ్యక్షులు బొల్లెపల్లి కిషన్, గ్రామ పెద్దలు ఎడ్ల చిన్న సత్తిరెడ్డి, జిన్నా నర్సింహ, వలబోజు నర్సింహచారి, అన్నేపు వెంకటేష్, అన్నేపు శ్రీశైలం, పిన్నం అనురాధ, జిన్నా పెద్ద నర్సింహ పాల్గొన్నారు.