Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్
- మోత్కూరులో ప్రజాభారతి 'మోదుగురేకులు' పుస్తకావిష్కరణ
నవతెలంగాణ-మోత్కూరు
ప్రపంచాన్ని సైతం తన తపోశక్తితో రాయిలా మార్చే శక్తి రుషికి ఉంటుందని, కానీ రాయిలా చైతన్యంలేకుండా మగ్గిపోతున్న సమాజాన్ని, ప్రపంచాన్ని మేల్కొలిపే శక్తి కవులు, సాహితీవేత్తలకు ఉంటుందని తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్‌కుమార్ అన్నారు.మోత్కూరు ప్రజాభారతి సాహితీ, సాంస్కృతిక, సామాజిక సేవాసంస్థ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక జీఎంఆర్ ఫంక్షన్హాల్లో 'మోదుగురేకులు' పుస్తకావిష్కరణ, సాహితీ పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిశోర్‌కుమార్ మాట్లాడుతూ ఎందుకో తెలియదు గాని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వచ్చిన కన్ఫ్యూజన్ కారణంగా ప్రశ్నించే చాలా గొంతులు మూగబోయాయని, ఎందుకో నాకూ తెలియదంటూ మీకే తెలియాలన్నారు. ఏదైనా తప్పు గాని, నష్టం గాని జరిగితే అది రాష్ట్ర ప్రభుత్వామా, కేంద్ర ప్రభుత్వమా ఏదైనా కావచ్చు ప్రశ్నిస్తే తప్పేముందని, కవులు, సాహితీవేత్తలు, మేధావివర్గంగా ఇకమీదటనైనా ప్రశ్నిస్తారని ఆశిస్తున్నానన్నారు. మేధావివర్గం కేంద్ర ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే మంచి ఆర్టికల్ రాసి చెప్పవచ్చని, తానేదో పార్టీలో, రాష్ట్ర ప్రభుత్వంలో ఉండి అనుకూలంగా మాట్లాడుతున్నానని కాదని ఒక దగ్గర తప్పు జరిగితే ప్రశ్నించాల్సిన అర్హత, హక్కు కవులు, సాహితీవేత్తలకే ఉంటుందన్నారు. నిజమైన తెలంగాణ ఉద్యమం జరిగి ఎన్నో ప్రాణాలు పోతున్నా ప్రపంచానికి చూపించకుండా ఆంధ్రావాళ్లు కృత్రిమ ఉద్యమం చేస్తున్న సమయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ రెండే మాటల్లో ''మనది చాన్నాళ్ల ఉద్యమం..వారిది ఛానళ్ల ఉద్యమం'' అని చెప్పారన్నారు. తెలంగాణ ఉద్యమంలో సాహిత్యమే కీలక భూమిక పోషించిందన్నారు.తెలుగు భాషా అంతరించి పోతుందేమోనన్న ఒక భయాందోళన వాతావరణం కనిపిస్తున్న నేపథ్యంలో కనీసం భావితరానికి తెలుగు భాష ప్రాముఖ్యతను అందించాలన్న తపనతో ప్రజాభారతి చేస్తున్న ప్రయత్నాన్ని ఆయన అభినందించారు.ఈ సందర్భంగా నల్లగొండకు చెందిన సాహితీవేత్త డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డికి ప్రజాభారతి జీవన సాఫల్య పురస్కారం, రచయిత్రి నెల్లుట్ల రమాదేవి, దాస్యం సేనాధిపతిలకు సాహిత్య పురస్కారం, ప్రొఫెసర్ డాక్టర్ జలంధర్ రెడ్డికి సాహిత్య సేవా పురస్కారం ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ప్రజాభారతి అధ్యక్షుడు తొర్ర ఉప్పలయ్య అధ్యక్షతన జరిగిన సభలో మున్సిపల్ చైర్మన్ తీపిరెడ్డి సావిత్రిమేఘారెడ్డి, ఎంపీపీ రచ్చ కల్పనలక్ష్మీ నర్సింహారెడ్డి,జెడ్పీటీసీ గోరుపల్లి శారదసంతోష్‌రెడ్డి, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ, ఉమ్మడి ఏపీ సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లు, మేడ్చల్ అడిషనల్ కలెక్టర్ డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, రిటైర్డ్ కలెక్టర్ డీవీ.రాయుడు, సెక్రటరీ టు సీఎస్ కె.విద్యాసాగర్, ప్రొఫెసర్లు చక్రధర్ రావు, అక్కెనపల్లి రఘురాంరావు, రచయితల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు పోరెడ్డి రంగయ్య, బండారు జయశ్రీ, ప్రజాభారతి ప్రధాన కార్యదర్శి మర్రి జయశ్రీ, ఉపాధ్యక్షులు వారాల యాదగిరి, మోత్కూరు బ్రహ్మచారి, దేవినేని అరవిందరాయుడు, టి.మనోహరాచారి తదితరులు పాల్గొన్నారు.