Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆన్లైన్ రాదు...ఆఫ్లైన్దే జోరు...
- బుక్ చేసుకున్న జాడ లేని ఇసుక
- రోజుల తరబడి ఎదురుచూస్తున్న గృహ నిర్మాణదారులు
- ప్రభుత్వ పనుల పేరిట ఇసుక అక్రమ రవాణా
- అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్న ఇసుక
- ప్రభుత్వ ఆదాయానికి పెద్దఎత్తున గండి
నవతెలంగాణ-మిర్యాలగూడ
సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆన్లైన్ బుక్ చేసుకున్న వెంటనే ఇసుక వినియోగదారులకు సరఫరా అయ్యేది. కాని నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఆన్‌లైన్‌కు బదులు ఆఫ్‌లైన్‌లో ఇసుక రవాణా జోరుగా సాగుతుంది. అధికారుల సహకారంతో అక్రమ రవాణా చేస్తున్నారు. ఇసుక అక్రమార్కులే రాజ్యమేలుతు లక్షలు ఆర్జిస్తున్నారు. ప్రభుత్వ పనుల పేరిట ఇసుక అక్రమ రవాణా చేస్తూ కాసులుతో జేబులు నింపుకుంటున్నారు. ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు అధికారులు అనుమతులు ఇవ్వడంతో యేదేచ్ఛంగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. ఇదంతా పోలీసులు రెవెన్యూ అధికారులు కనుసన్నలోనే జరుగుతుండడంతో ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండిపడుతుంది.
మిర్యాలగూడ నియోజకవర్గంలోని మిర్యాలగూడ, వేమనపల్లి మండలాల్లో ఇసుక రీచ్‌లున్నాయి. మిర్యాలగూడ మండలంలోని కాల్వపల్లి, తక్కెలపాడు రీచ్‌లుండగా వేములపల్లి మండలంలోని రావులపెంట కామేపల్లి ఇసుకరీచ్‌లున్నాయి. ఈ రీచ్‌ల ద్వారా కేవలం ఆన్లైన్ మాత్రమే ఇసుకను సరఫరా చేయాలి. కాని ఆఫ్‌లైన్‌లో ఇసుక రవాణా జోరుగా నడుస్తుంది. నిత్యం వందలాది ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా అవుతుంది. దినదినాభివృద్ధి చెందుతున్న మిర్యాలగూడ పట్టణంలో భవన నిర్మాణాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇసుక అవసరం కూడా పెద్ద ఎత్తున ఉంది. దీన్ని ఆసరా చేసుకున్న అక్రమార్కులు ఆన్లైన్లో కాకుండా ఆఫ్‌లైన్‌లో ఇసుక అక్రమంగా రవాణా చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. ఈ రీచ్‌ల ద్వారా రోజు వందలాది ట్రాక్టర్ల ఇసుక రాత్రి, పగలు తేడా లేకుండా అక్రమంగా రవాణా చేస్తున్నారు. అక్రమార్కులు ఇసుకను శివారు ప్రాంతాలలో డంపింగ్ చేసుకొని అత్యవసర పరిస్థితిలో రెట్టింపు ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
ప్రభుత్వ పనుల పేరిట అక్రమ రవాణా...
ప్రభుత్వ పనుల పేరిట ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ లక్షల ఆర్జిస్తున్నారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల మరమ్మత్తులకు ఇసుక అవసరం ఉండగా దాని పేరిట పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మన ఊరు మనబడి పథకం కింద పాఠశాలల మరమ్మత్తులు దాదాపు పూర్తయిన వాటి పేరుతో గత నెల రోజుల నుంచి ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం. పంచాయతీరాజ్ మండల అధికారి సూచన మేరకు తాసిల్దార్ ఇసుక రవాణాకు లెటర్లు ఇస్తున్నారని, దానిపై ఎన్ని ట్రాక్టర్లు అని రాయకుండా ఉదయం నుండి సాయంత్రం వరకు అనుమతి అంటూ లెటర్ ఇవ్వడం వల్ల జోరుగా ఇసుకను రవాణా చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. అక్రమార్కులు దీనిని ఆసరా చేసుకొని పంచాయతీరాజ్ అధికారితో ఇసుక అవసరం ఉందని చెప్పించుకుని తాసిల్దార్ ద్వారా ఇసుక లెటర్లు పొందుతూ ట్రక్కులకొద్దీ ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మండలంలోని కాల్వపల్లి గ్రామానికి చెందిన ఓ ఇసుక దళారీ తహసిల్దార్ నుంచి అనధికారికంగా లెటర్లు పొంది వాటిని ఇసుక రవాణాదారులకు అమ్ముకుంటున్నట్టు సమాచారం. ఒక్కొక్క లెటర్ 2వేల నుంచి 5వేల వరకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. రోజు తహసిల్దార్ నుండి పదుల సంఖ్యలో లెటర్లు జారీ అవుతుండడంతో వాటి ద్వారా వందల ట్రాక్టర్ల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఈ అక్రమ ఇసుక రవాణాలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల పాత్ర కీలకంగా ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. వారి ఒత్తిడి మేరకే రెవెన్యూ, పోలీసు అధికారులు చూసిచూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణాదారుల నుండి పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నారనే విమర్శలు కూడా వెలువెడుతున్నాయి.
ఆన్లైన్ రాదు...ఆఫ్ లైన్దే జోరు...
నిర్మాణదారులకు అవసరమైన ఇసుక కోసం ముందుగానే ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలి. బుకింగ్ ఆధారంగా సీరియల్ ప్రకారం బుకింగ్ చేసుకున్న మూడు నాలుగు రోజుల్లోపే ఇసుక వినియోగదారునికి సరఫరా కావాలి. మిర్యాలగూడ పట్టణ పరిసర ప్రాంతాలలో వందలాదిమంది వినియోదారులు ఇసుక కోసం నెల రోజుల క్రితమే బుకింగ్ చేసుకున్న ఇప్పుటి వరకు ఇసుక సరఫరా కాలేదు. ఇసుక సంబంధించిన డబ్బులు కూడా చెల్లించినప్పటికీ నెలల తరబడి ఇసుక రాకపోవడంతో నిర్మాణాలు ఆగిపోయి వినియోదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆన్లైన్ ద్వారా ప్రతిరోజు వందలాది ట్రాక్టర్ల ఇసుక రవాణా జరగాల్సినప్పటికీ అది కావటం లేదు. కానీ ఆప్‌లైన్‌లో మాత్రం ఇసుక రవాణా కావటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోజు కనీసం 10 ట్రాక్టర్లు కూడా ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న వారికి ఇసుక రాకపోవడంతో నిర్మాణాలు నిలిచిపోయి వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆఫ్‌లైన్‌లో మాత్రం వందలాది ట్రాక్టర్లు ఇసుక రవాణా జరుగుతుండడంతో తప్పని పరిస్థితిలో వినియోగదారులు రెట్టింపు ధరలు చెల్లించి ఇసుకను కొనుగోలు చేస్తున్నారు. కొందరి ఇసుక అక్రమ రవాణాదారులు ఆఫ్‌లైన్ ఇసుకను శివారు ప్రాంతాలలో డంపింగ్ చేసి అదనపు ధరలకు విక్రయిస్తు సొమ్ము చేసుకుంటున్నారు.
ప్రభుత్వ ఆదాయానికి గండి..
ఆన్లైన్ ద్వారా ఇసుక సరఫరా చేస్తే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది. కానీ ఆఫ్‌లైన్ ద్వారా ఇసుక రవాణా అవుతుండడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడుతుంది. గత నెల రోజుల నుంచి ఆన్లైన్ చేసిన వారికి ఇసుక రాకపోవడంతో ఆన్లైన్ బుకింగ్ కూడా తగ్గిపోయింది. రోజుల తరబడి వేచి చూసినా ఇసుక రాకపోవడంతో బుకింగ్ చేసేందుకు వినియోగదారులు ముందుకు రావడం లేదు. అత్యవసర పరిస్థితిలో రెట్టింపు ధరలు వెచ్చించి ఇసుక కొనుగోలు చేయడం వల్ల ఆన్లైన్ బుకింగ్ లేక ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. ఇంత నష్టం జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.