Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
తెలంగాణ ప్రభుత్వ పశు వైద్య శాఖలో గ్రామీణ ప్రాంతాలలో పశువులకు గొర్రెలకు, మేకలకు, గేదెలకు, అనేక రకాల వైద్య సేవలు అందిస్తున్న పశు మిత్రలందరికీ కనీస వేతనం నిర్ణయించాలని లేదా ఆశా వర్కర్స్ మాదిరిగా పారితోషకాలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పశు మిత్రల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావుకు, పశువర్ధకశాఖ జెడీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో గేదెల, గొర్రెల, మేకల, కోళ్లకు, కుక్కల తదితర జంతువులకు కృత్రిమ గర్భధారణ, వ్యాక్సిన్, టీకాలు వేయడం శాస్త్ర చికిత్సలు చేయటం, గాలికుంట వ్యాధి, నీలి నలిక వ్యాధి, పోచమ్మ వ్యాధి, దొబ్బి వ్యాధి తదితర జబ్బులకు మందులు వేస్తూ రైతులకు చేదోడు వాదోడిగా ఉంటున్న పసుమిత్రలకు ఎలాంటి వేతనం లేకపోవడం అన్యాయమన్నారు. ప్రభుత్వం వీరికి కనీస వేతనం నిర్ణయించాలని అప్పటి వరకు ఆశా వర్కర్ల మాదిరిగా పారితోషకాలు ఇవ్వాలని, గుర్తింపు కార్డు, యూనిఫాం, ప్రమాద బీమా, పీఎఫ్ ఈఎస్ఐ, టీఏడీఏ లు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతావని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పసుమిత్రల యూనియన్ అధ్యక్షులు పి మనిషా, ప్రధాన కార్యదర్శిగా అండెం సునీత, జిల్లా నాయకులు ఎస్కే. హస్మ, జే.రాధిక, సీహెచ్ దుర్గ భవాని, ఎస్ .మాధవి, డీ. మాధవి, ఎం. మంజుల, బీ. జానకమ్మ, ఎం.సుజాత, ఎన్.సంధ్య, వై సరిత, ఎన్. సంధ్య, ఎం. కవిత, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.