Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవినాయక్
నవతెలంగాణ-మిర్యాలగూడ
కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీల అమలు కోసం జనవరి 26న మిర్యాలగూడలో జరిగే ట్రాక్టర్ ర్యాలీని జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రవినాయక్ పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని గూడూరులో రైతు ట్రాక్టర్ ర్యాలీపై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం మూడు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్న సందర్భంలో రైతులకు రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను నేటికీ ఏ ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం రైతులు పెట్టిన పెట్టుబడికి 50శాతం కలిపి మద్దతుల నిర్ణయించి గ్యారెంటీ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ పంటల ధరల ప్రకారం పెట్టిన పెట్టుబడి 80శాతం కూడా రైతులకు రాక అప్పుల పాలవుతున్నారని, అటువంటి రైతుల రుణాలను రద్దు చేయాలని కోరారు. రుణ విమోచన చట్టం చేసి రైతులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2006 అటవీ హక్కు చట్టం ప్రకారం అర్హులైన అందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని, కౌలు రైతులందరికీ గుర్తింపు రుణ, అర్హత కార్డులు ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో దేశ వ్యాప్తంగా మరో రైతాంగ ఉద్యమానికి ఆల్ ఇండియా కిసాన్ సభ సిద్ధమవుతుందని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు నిరసిస్తూ దేశవ్యాప్తంగా జరిగే ట్రాక్టర్ ర్యాలీలో రైతాంగం లక్షలాదిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు నూకల జగదీష్ చంద్ర, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పిల్లుట్ల సైదులు, డీవైఎఫ్ఐ మండల కార్యదర్శి బాబునాయక్, డీవైఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ కష్ణ, సీనియర్ నాయకులు వెంకయ్య, శాఖ కార్యదర్శి గోపి, తదితరులు పాల్గొన్నారు.
చిట్యాల : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జనవరి 26వ తేదీన నిర్వహించే ట్రాక్టర్ ర్యాలీ నిరసన కార్యక్రమంలో రైతులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కత్తుల లింగస్వామి, రైతు సంఘం జిల్లా నాయకులు ఆరూరి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సోమవారం పిట్టంపల్లి గ్రామంలో ప్రజాసంఘాల సభ్యత్వం క్యాంపెయిన్‌ను ఉద్దేశించి వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలను రద్దు చేస్తూనే దొడ్డిదారిన రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను అమలు చేయడానికి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జనవరి 26వ తేదీన దేశవ్యాప్తంగా జరుగు నిరసన కార్యక్రమంలో రైతులు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఐతరాజు నరసింహ, ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు జిట్ట సరోజ, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి మెట్టు పరమేష్, జీఎంపీఎస్ మండల నాయకులు మెట్టు నరసింహ, ఐద్వా మండల అధ్యక్షులు కందుల కవిత, సుశీల, మంగమ్మ, అలివేలు, పద్మ సుజాత తదితరులు పాల్గొన్నారు.