Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరిగిన ధరలకు అనుగుణంగా కాస్మోటిక్ చార్జీలు పెంచాలి
- ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిద్రతో నిరసన
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్కు సొంత భవనాలు నిర్మించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా కాస్మోటిక్ చార్జీలు పెంచాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి ఆర్డీవో కార్యాలయం ఎదుట విద్యార్థులు నిద్ర చేసి నిరసన తెలిపారు. ఈ నిరసనకు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, రైతు సంఘం, డీివైఎఫ్ఐ, కేవీపీఎస్ మద్దతు తెలిపారు. నిరసన చేస్తున్న విద్యార్థులను, ఎస్ఎఫ్ఐ నాయకులను నిరసనన విరివింపజేయాలని పోలీసులు బెదిరించారు. పోలీసులు విద్యార్థుల మధ్య కొంత వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ డివిజన్ వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లకు, గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హాస్టల్లో ఉండే విద్యార్థులు నెలకు 750 రూపాయలు, 850 రూపాయలు, 1050 రూపాయలతో భోజనం ఏవిధంగా చేస్తారన్నారు. ఒక రోజుకు విద్యార్థికి 33 రూపాయలతోనే ఒక విద్యార్థి ఏ విధంగా నాణ్యమైన భోజనం తింటారు..ప్రభుత్వం పెద్ద మనుసు చేసుకొని ఆలోచించాలన్నారు. ఇవాళ 30 రూపాయలకు కనీసం వాటర్ బాటిల్ రాలేని పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వం పేద, మధ్యతరగతి విద్యార్థుల తరఫున ఆలోచన చేసి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థులతో కలిసి బలమైన విద్యార్థి ఉద్యమాలు నిర్మిస్తారని హెచ్చరించారు. ప్రస్తుతం హాస్టల్లో గురుకులాలు అద్దె భవనాలలో ఉండటం, చాలి చాలనీ వసతి గహాల గదుల్లో విద్యార్థులు మగ్గుతున్న ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన కలెక్టరేట్లు, కొత్త సచివాలయం ఏ విధంగా అయితే కట్టిస్తుందో అదే సంకల్పంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వేంకటేశ్వర్లు, డీివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రవినాయక్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష , కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్, డివిజన్ కార్యదర్శి కొర్ర సైదానాయక్, జగన్ నాయక్, దామరచర్ల మండల కార్యదర్శి థీరవత్ వీరన్న, వేములపల్లి మండల కార్యదర్శి పుట్ట సంపత్, ఆకాష్, న్యూమాన్, ఉపేందర్, రవి, మంగ్తా, సూర్య తదితరులు పాల్గొన్నారు.