Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ
నవతెలంగాణ-చండూరు
చండూరు మున్సిపాలిటీలో పనిచేస్తున్న వివిధ కేటగిరి ఉద్యోగ కార్మికులందరికీ మూడు నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు, పెరిగిన వేతనాల ఏరియర్స్ వెంటనే ఇవ్వాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. పెండింగ్ వేతనాలు పది నెలల వేతనాలు ఏరియర్స్ కోసం గత 4 రోజులుగా సమ్మె చేస్తున్న చండూరు మున్సిపల్ కార్మికుల సమ్మె శిబిరాన్ని మంగళవారం ఆయన సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలని అనేకసార్లు మున్సిపల్ కమిషనర్ కు, చైర్మన్ కు విన్నవించిన బడ్జెట్ లేదని రేపు మాకు ఇస్తామని మూడు నెలలుగా కాలం గడుపుతున్నారని విమర్శించారు. పెరిగిన ధరల నేపథ్యంలో నిత్యవసరంలో సరుకులు కొనలేక ఇంటి అద్దెలు కరెంట్ బిల్లలు కట్టలేక పిల్లల చదువులు చదివించుకోలేక అనేక ఇబ్బందులు కార్మికులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కొత్త సంవత్సరంలో మొదటి పండుగ అయిన సంక్రాంతి రోజు పస్తులు ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. మున్సిపల్ కార్మికులు పనిచేస్తేనే పన్నుల ద్వారా మున్సిపాలిటీకి ఆదాయం వస్తుందని వచ్చిన ఆదాయాన్ని పాలకవర్గం అధికారులు ఎంజారు చేస్తూ కార్మికుల కడుపులు మారుస్తున్నారని ఎద్దేవ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సి ప్రకటించి వేతనాలు పెంచితే పెంచిన ఏరియర్స్ కూడా ఇంతవరకు ఇవ్వలేదన్నారు. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి మూడు నెలల పెండింగ్ వేతనాలు, పీిఆర్సి ఏరియర్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి, సీఐటీయూ మండల కన్వీనర్ మోగుదాల వెంకటేశం, గీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ, మున్సిపల్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఏ. చిన్న వెంకన్న , కత్తుల సైదులు, ఉపాధ్యక్షులు లింగస్వామి, కోశాధికారి నాగరాజు, యూనియన్ నాయకులు ఏ. రామచంద్రు, కలమ్మ, చంద్రమ్మ ,అలివేలు ధనయ్య యాదయ్య తదితరులు పాల్గొన్నారు.