Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తలంబ్రాల బియ్యం, పట్టు వస్త్రాలు సమర్పించిన కలెక్టర్ టీ.వినయ్ కృష్ణారెడ్డి
- జనసంద్రంగా మారిన చెర్వుగట్టు
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
శైవ క్షేత్రాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి కల్యాణం ఆదివారం తెల్లవారు జామున నయనానందకరంగా..భక్త జనుల శివనామస్మరణల మధ్య వైభవంగా...కళ్యాణం కమనీయంగా జరిగింది. శ్రీ పార్వతి జడల రామలింగేశ్వరుడి కల్యాణానికి ముందు స్వామి, అమ్మవార్ల ఎదుర్కోలు ఘట్టాన్ని శైవశాస్త్రానుసారం చుడముచ్చటగా నిర్వహించారు. పల్లకి ఊరేగింపుతో సేవతో కల్యాణ మండపానికి శివపార్వతులను తోడ్కోని వచ్చి రంగురంగుల రకరకాల పూలు, విద్యుత్ దీపాలంకరణలు, పచ్చని తోరణాలతో అలంకరించిన కల్యాణ మండపంలో ఆసీనులుగావించారు. పట్టువస్త్రాలు, పూలమాలాంకృతులైన వధూవరులు శివపార్వతులను ముస్తాబు చేసి కల్యాణఘట్టాన్ని రమణీయంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు పోతుల పాటి రామలింగేశ్వర శర్మ సారధ్యంలోని అర్చక బృందం శివపార్వతుల కల్యాణోత్సవాన్ని శాస్తయ్రుక్తంగా వేదమంత్రోచ్చరణల మధ్య, భక్తుల హరహర మహాదేశ, శంభోశంకర స్మరణల మధ్య జరిపించారు. శివ పార్వతుల మంగల్యాణ ధారణ ఘట్టాన్ని తిలకించిన భక్తజనం భక్తీ పారవశ్యంతో పులకించారు. అనంతరం తలంబ్రధారణ ఘట్టం నిర్వహించారు.
తలంబ్రాల బియ్యం, పట్టు వస్త్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ టీ.వినరు క్రిష్ణారెడ్డి
ప్రతి సంవత్సరం శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా రథసప్తమి పురస్కరించుకొని నిర్వహించే శ్రీ పార్వతి జడ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి ప్రభుత్వం తరుపున జిల్లా కలెక్టర్ టీి.వినయ్ క్రిష్ణారెడ్డి తలంబ్రాల బియ్యం పట్టు వస్త్రాలు సమర్పించారు. పార్వతి జడల రామలింగేశ్వరుల కల్యాణోత్సవం పిదప స్వామి అమ్మవార్లకు వేలాది మంది భక్తులు ఒడి బియ్యం సమర్పించారు. స్వామివారికి పాదుక మొక్కులను సమర్పించడంలో భక్తులు పోటీ పడ్డారు.
పోలీస్‌శాఖ భారీ బందోబస్తు..
కల్యాణోత్సవం సందర్భంగా పోలీస్‌శాఖ గతంలో ఎన్నడు లేని విధంగా 970 మంది పోలీస్ సిబ్బందితో అడుగడున భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న స్థలం నిర్మాణంలో ఉండడంతో కళ్యాణస్థలం పక్క భాగంలో ఒడి బియ్యం కొబ్బరి కుడుకలు జాకెట్ ముక్కలు స్వామి అమ్మవార్లకు సమర్పించుకునే విధంగా సిద్ధం చేసినప్పటికీ స్థలం కొద్దిగా ఉండడంతో వేలాది మంది భక్తులు ఒడి బియ్యం సమర్పించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారికి పోలీసు వారు క్యూ లైన్లో పంపించే విధంగా చర్యలు తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నార్కట్‌పల్లి అద్దంకి రహదారిపై భారీగా వాహనాలు రావడంతో చెరువుగట్టు ఎల్లారెడ్డిగూడెం దారి ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
జనసంద్రంగా మారిన చెరువుగట్టు..
శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఆదివారం తెల్లవారుజామున కావడంతో సెలవు రోజు ఉండడం వల్ల భక్తులు ఉదయం ఎనిమిది గంటల తర్వాత భారీగా తలంబ్రాలు సమర్పించుకునేందుకు వేల సంఖ్యలో రావడంతో గుట్ట పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. స్వామివారి ఉచిత దర్శనం చేసుకోవడానికి సుమారు రెండు గంటల సమయం పట్టినట్లు భక్తులు పేర్కొంటున్నారు. స్వామివారి కల్యాణోత్సవంలో స్థానిక శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్య, అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, ఆర్డీఓ జయ చంద్రరెడ్డి, డీఎస్పీ వీ.నర్సింహారెడ్డి, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, జై బోలో తెలంగాణ సినీ డైరెక్టర్ ఎన్.శంకర్, గ్రామ సర్పంచ్ మల్గా బాలకృష్ణ, ఎంపీటీసీ మేకల రాజిరెడ్డి, దేవాదాయ సహాయ కమిషనర్ మహేంద్ర కుమార్, ఆలయ కార్య నిర్వహణ అధికారి నవీన్, తహసిల్దార్ మురళీమోహన్, ఎంపీడీవో యాదగిరిగౌడ్, ఆలయ సిబ్బంది తిరుపతిరెడ్డి, ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు.