Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండడెస్క్
చేతి వృత్తిదారులకు రాష్ట్ర బడ్జెట్లో 25 వేల కోట్లు నిధులు కేటాయించి వృత్తుల వారీగా ఖర్చు చేయాలని సోమవారం నల్లగొండ కలెక్టరేట్ ఏవో మోతిలాల్‌కు చేతి వృత్తి దారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చేతి వృత్తిదారుల సంఘం రాష్ట్ర నాయకులు బండ శ్రీశైలం, గంజి మురళీధర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చేతి వృత్తిదారులకు అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాటికి నిధులు కేటాయించాలన్నారు. అరకొరగా కేటాయించిన నిధులను ఖర్చు చేయకుండా కేవలం కార్పొరేషన్లకు నామినేటెడ్ పదవులు భర్తీ చేసి రాజకీయ నిరుద్యోగాన్ని తీర్చుకున్నది తప్ప వీటి ద్వారా చేతివృత్తిదారుల అభివృద్ధికి ఏమాత్రం ప్రయోజనం జరగలేదని ఆవేదన చెందారు. 2023 రాష్ట్ర బడ్జెట్లో చేతి వృత్తుల అభివృద్ధి కోసం నిధులు కేటాయించి నిధులను ఖర్చు చేయాలని చేతి వృత్తిదారుల సంఘం రాష్ట్ర నాయకులు బండ శ్రీశైలం, గంజి మురళీధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చేతివృత్తులపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలన్నారు. అందరికీ ఉచితంగా ఇల్లు నిర్మించాలని, ప్రతి వృత్తిదారుని కుటుంబానికి బీసీ బందు కింద 10 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించాలని, అర్హత కలిగిన వృత్తిదారులందరికీ వృద్ధాప్య పెన్షన్లు 5000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏవోను కలిసిన వారిలో చేతి వృత్తిదారుల సంఘం సమన్వయ కమిటీ నాయకులు అవిశెట్టి శంకరయ్య, సాగర్ల మల్లేశం, కర్నాటి శ్రీరంగం, కొండా వెంకన్న, చెరుకు పెద్దలు, మురారి మోహన్, తదితరులు ఉన్నారు.