Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక
నవ తెలంగాణ-దామరచర్ల
గ్రామపంచాయతీ కార్మికుల మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని , కనీస వేతనం19 వేలు ఇవ్వాలని, పర్మినెంట్ ఇతర సమస్యల పరిష్కారం కోసం వచ్చే నెల12న పాలకుర్తి నుండి 28న హైదరాబాద్ వరకు వెళ్లే పల్లె నుండి పట్నం పాదయాత్రను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణలి పిలుపునిచ్చారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) దామరచర్ల మండలం జనరల్ బాడీ సమావేశం సోమవారం ఎండీ. జహీర్ అధ్యక్షతన స్థానిక సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామపంచాయతీలలో పారిశుద్ధ్యం మంచినీటి సరఫరా, వీధిలైట్ల నిర్వహణ పన్నుల వసూలు అనేక రకాల పనులు చేస్తూ సేవలందిస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచకుండా రూ.8,500 వేతనంతో వెట్టి చాకిరి చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వివిధ కేటగిరీలుగా ఉన్న ఉద్యోగులను జీవో నెంబర్ 51 ద్వారా మల్టీపర్పస్ విధానాన్ని తెచ్చి కార్మికులను అనేక వేధింపులకు గురి చేస్తూ పనిగంటలు సెలవులు లేకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. అనేక ఏండ్లుగా పనిచేస్తున్న కార్మికులందరికీ పరిమెంట్ చేయాలనే డిమాండ్ చేశారు. జిల్లాలో కార్మికులను సర్పంచులు, కార్యదర్శులు వేధింపులకు గురి చేస్తున్నారని, పంచాయతీతో సంబంధంలేని నర్సరీ, ఇతర పనులు చేస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీపీిఓ ఇచ్చిన సర్కులర్ ఆధారంగా అందరికీ పోస్టల్ బీమా అమలు చేయాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం17 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జీపీ కార్మికుల పాదయాత్రను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా నాయకులు బైరం దయానంద్, నాయకులు ఎస్. పాప నాయక్, విజయ్, ఏ. సైదులు, సుందరమ్మ, శ్రీరాములు,తదితరులు పాల్గొన్నారు.