Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ డెస్క్
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 60 ప్రకారం ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్స్, మెడికల్ కళాశాల అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కనీస వేతనం పిఎఫ్, ఈఎస్ఐతో కలిపి రూ.15,600 ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి అన్నారు. తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) నల్లగొండ జిల్లా కేంద్ర హాస్పిటల్ వర్కర్స్ జనరల్ బాడీ సమావేశం సోమవారం హాస్పిటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ నూతనంగా వచ్చిన ఔట్సోర్సింగ్ ఏజెన్సీతో మాట్లాడడం జరిగిందని, వారికి జీవో ప్రకారం పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా చెల్లించాలని, సంవత్సరానికి రెండు జతల యూనిఫాం, వారాంతపు సెలవులు, క్యాజువల్ లీవులు అమలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఔట్సోర్సింగ్ కార్మికులకు రావలసిన సౌకర్యాలను హాస్పిటల్ చైర్మెన్, జిల్లా కలెక్టర్, సూపరిండెంట్ పర్యవేక్షణ ఉండాలని కోరారు. కార్మికులకు రావాల్సిన సౌకర్యాలు కల్పిస్తూ పారిశుద్ధ్య నిర్వహణ పటిష్టంగా జరిగే విధంగా చూడాలని కోరారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా సీఐటీయూ పోరాటాల ఫలితంగా జీవో 60 అమలు చేస్తూ స్థానికంగా టెండర్లు వేయాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. దాని ప్రకారం టెండరు వేయడంలో హాస్పిటల్ అధికారులు చేస్తున్న నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ అనేక మార్లు ధర్నాలు చేశామని, మంత్రి హరీష్రావు దగ్గరకు వెళ్లి రెండుసార్లు వినతిపత్రం ఇచ్చామని, జిల్లా కలెక్టర్కు పలుమార్లు విజ్ఞప్తి చేసిన తరువాత నేడు టెండర్ ప్రక్రియ ముగిసి అవుట్సోర్సింగ్ ఏజెన్సీ జనవరి నుండి నూతన వేతనాలు అమలు జరిపే విధంగా కృషి జరిగిందని తెలిపారు. పోరాటాల ఫలితంగా సాధించుకున్న వేతనాన్ని పీఎఫ్, ఈఎస్ఐ, గుర్తింపు కార్డులు, యూనిఫామ్ అమలు జరిగే విధంగా యూనియన్ పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) నల్లగొండ ప్రభుత్వ హాస్పిటల్ యూనిట్ కమిటీ అధ్యక్షులు మునగ వెంకన్న, కార్యదర్శి బీ. నరేష్, కోశాధికారి నాగమణి, పర్వతం రామయ్య, అంబటి కృష్ణ, సురేష్, అండాలు, తదితరులు పాల్గొన్నారు.