Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
యాదాద్రి దేవస్థానంలో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్ అన్నారు. సోమవారం పట్టణ కేంద్రంలో ఆ సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న యాదాద్రి దేవస్థానంలో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లేకపోవడం దేవాలయం పైన ఉన్న ఉద్యోగాలను కాంట్రాక్ట్ పేరుతో అమ్మడం, ఉద్యోగాల కల్పనలో దేవాలయ ఈవో ,స్థానిక శాసనసభ్యులు పక్షపాతం వహించడం దారుణమన్నారు. స్థానికంగా అభివృద్ధి అవుతున్న దేవాలయంలో స్థానిక యువతకు ఉద్యోగాలు లేక ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లి ఉద్యోగాలు చేసే పరిస్థితి వస్తుందని ఒకవైపు యాదాద్రి దేవస్థానం అభివృద్ధి అవుతున్న మరోవైపు దేవస్థాన పరిధిలో నిరుద్యోగం కూడా పెరుగుతుందని దేవాలయ అభివృద్ధి కోసం అనేకమంది భూములు త్యాగం చేశారు, ఉపాధిని కూడా త్యాగం చేశారు, అలాంటివారికి దేవస్థానంలో ఏదైనా ఒక ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు కోనాపురం ప్రవీణ్, గ్యాదపాక వెంకటేష్, నరసింహ, పాండు తదితరులు పాల్గొన్నారు.