Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపేందర్
- అంబేద్కర్ విగ్రహం ముందు కండ్లకు గంతలు కట్టుకొని నిరసన
నవతెలంగాణ-నల్లగొండ
బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఉందని బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్లో బీసీలకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ బీసీలకు జనాభా దామాషా ప్రకారం 30 వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సోమవారం తెలంగాణ రాష్ట్ర బీసీ యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన ప్రదర్శన చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దీపెందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మొత్తం 2,90,396 లక్షల కోట్ల బడ్జెట్లో 65 శాతానికి పైగా ఉన్న బీసీలకు కేవలం 6,229 కోట్లు కేటాయించి బీసీల గొంతుకోసి తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. అప్పులేమో బీసీలకు సంపదేమో అగ్రవర్ణాలకా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని 30 వేల కోట్లు కేటాయించి బీసీలపై తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి చాటుకోవాలన్నారు. అంతేకాకుండా బీసీ సబ్ ప్లాన్, బీసీ బంధును తక్షణమే ప్రవేశపెట్టి అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా కార్యదర్శి యలిజాల వెంకటేశ్వర్లు, నల్లగొండ నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, బీసీ యువజన సంఘం నాయకులు యలిజాల రమేష్, బట్టు శ్రీశైలం, రవీందర్, విజరు, సాయి తదితరులు పాల్గొన్నారు.