Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ కథానాయకుడు నాని సోదరి దీప్తి గంటా దర్శకత్వం వహించిన తొలి వెబ్ సిరీస్ 'మీట్ క్యూట్'. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నాని ఈ సిరీస్‌ను నిర్మించారు. ఐదు కథల ఆంథాలజీగా ఆమె తెరకెక్కించిన ఇందులో వర్ష బొల్లమ్మ, శ్రీదివ్య, సమీర్, అశ్విన్ కుమార్, సత్యరాజ్, రుహానీ శర్మ, రాజ్ చెంబోలు, రోహిణి మొల్లేటి, ఆకాంక్షా సింగ్, దీక్షిత్ శెట్టి అలేఖ్య హారిక, ఆదా శర్మ, శివ కందుకూరి, సునైన తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ నెల 25న సోని లివ్‌లో 'మీట్ క్యూట్' ఎక్స్‌క్లూజివ్ ప్రీమియర్‌కు సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా దర్శకురాలు దీప్తి గంటా మాట్లాడుతూ, 'నేను గతంలో ఒక షార్ట్ ఫిలిం చేశాను. 'మీట్ క్యూట్'లో ఒక కథ రాసినప్పుడు నానికి వినిపిస్తే ఇలాంటివి ఇంకో మూడు నాలుగింటిని కలిపి ఆంథాలజీ చేయవచ్చని సలహా ఇచ్చాడు. నాని అడిగినా కూడా ఏదైనా మంచి ఆలోచన ఇన్స్పైర్ చేశాకే స్క్రిప్ట్ రాశాను. ప్రయాణాల్లో, ఇతర సందర్భాల్లో ఎవరైనా తెలియని వారితో పరిచయం చేసుకుని మాట్లాడటం నాకు అలవాటు. అలాంటి అపరిచిత వ్యక్తుల మధ్య సంభాషణ ఎలా ఉంటుంది అనే ఊహతో ఈ స్క్రిప్ట్ మొదలు పెట్టాను. మన లైఫ్‌లో ఎదురయ్యే ప్లెజంట్ మూమెంట్స్‌తో పాటు వివిధ సందర్భాలను ఈ కథల్లో చూపిస్తాం. అర్బన్ బేస్డ్గా ఈ కథ సాగుతుంది. అయినా ప్రేక్షకులందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఓ మంచి లవ్ స్టోరీ రాస్తే ఆ కథను నాని హీరోగా తెరకెక్కిస్తా. ఇకపైనా మంచి ఫీల్ గుడ్ స్క్రిప్ట్ రాసి డైరెక్ట్ చేస్తాను' అని చెప్పారు.
'ఫస్ట్ ఈ స్క్రిప్ట్‌ని చాలా రోజులు చదవకుండా పక్కన పెట్టాను. కొన్ని పేజీలు చదివేసరికి ఆ కథలో లీనమయ్యాను. అంత ఆసక్తిగా అనిపించింది. ఈ స్క్రిప్ట్‌ని మా సిస్టర్ కాకుండా మరెవరు రాసినా ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చేవాడిని. ఇందులో క్యారెక్టర్స్, అవి మాట్లాడుకునే మాటలు, వాళ్ల మధ్య వచ్చే సందర్భాలు అన్నీ చాలా సహజంగా ఉంటాయి. ఈ కథ సినిమాకు ఉపయోగపడదు. ఎందుకంటే మనం సినిమాల్లో ఎంత నేచురల్ స్టోరీ తీసుకున్నా, దానికి కొంత డ్రామా కలుపుతాం. కానీ ఇందులో ఆ పాత్రలు తర్వాత ఎలా ముందుకెళ్తాయి?, ఎలా ముగుస్తాయి అనే ఆసక్తి కలుగుతుంటుంది. నాకు ఇందులో నటించే క్యారెక్టర్ లేదు. సిస్టర్ డైరెక్టర్ కాబట్టి నేను ఖచ్చితంగా అతిథి పాత్రలో నటిస్తానని అంతా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ కథలో అవకాశం లేకుండా నటిస్తే పేరుకు కనిపించినట్లు ఉంటుంది. ఆంథాలజీ అంటే ఒక్కో కథను ఒక్కొక్కరు డైరెక్ట్ చేస్తారు. కానీ ఈ కథను తను ఒక్కరే తెరకెక్కించారు. ఈ సిరీస్ అంతా ప్లెజంట్, ఏదో ఒక మంచి విషయాన్ని, మంచి మాటను ఇది చూశాక నేర్చుకుంటాం' అని హీరో నాని అన్నారు.