Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య నటిస్తున్న కొత్త సినిమా 'బేబీ'. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్కేఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి రాజేష్ దర్శకుడు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో దర్శకులు అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, వశిష్ట, వెంకటేష్ మహా, వీఐ ఆనంద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ, 'తమిళనాడులోని ఓ ప్రాంతంలో జరిగిన వాస్తవ సంఘటనను స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కించిన చిత్రమిది. మారుతి తరహాలో వినోదాన్ని జోడిస్తూ కథను తయారు చేశాను. ఈ సినిమాతో ఓ మంచి ప్రయత్నం చేశామని అందరూ ప్రశంసిస్తారనే నమ్మకం ఉంది. ఓ మంచి కథను నిజాయితీగా తెరకెక్కించాలని మేము కష్టపడ్డాం. ఈ సినిమా విడుదల అయ్యాక బేబీ దర్శకుడు అని పిలుస్తారు. బడ్జెట్ పెరుగుతున్నా, డేట్స్ పెరుగుతున్నా ఏ రోజూ నిర్మాత ఎస్కేఎన్ ఒత్తిడి చేయలేదు' అని తెలిపారు. 'నాకున్న పెద్ద సపోర్ట్ నా స్నేహితుడు మారుతి. ఆయనా నేను కలిసి ఈ మాస్ మూవీ మేకర్స్ సంస్థను స్థాపించాం. ఇందులో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని చూస్తారు. ఆనంద్ ఈ సినిమాకు బ్యాక్ బోన్. విరాజ్ మరో హీరోగా బెస్ట్ పర్మార్మెన్స్ ఇచ్చారు. నాయిక వైష్ణవి ఈ కథకు ఆత్మలా నిలిచింది. ఆమెతో మూడు సినిమాలు చేయబోతున్నాం.ఈ సినిమా మా సంస్థకు ఒక మైల్స్టోన్ అవుతుంది' అని నిర్మాత ఎస్కేఎన్ అన్నారు.
హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ, 'నేను కంటెంట్ ఓరియెంటెడ్, సహజత్వానికి దగ్గరగా ఉండే చిత్రాలు చేస్తానని మిత్రులు చెబుతుంటారు. నా కెరీర్లో సవాలు విసిరిన, సంతృప్తినిచ్చిన సినిమా ఇది. ఈ కథలోని ఎమోషన్స్ మీకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతాయి. సినిమా కూడా నచ్చుతుంది' అని చెప్పారు. హీరోయిన్ వైష్ణవి మాట్లాడుతూ, 'ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత ఎస్కేఎన్, మారుతి గారికి థ్యాంక్స్. నా కెరీర్లో బెస్ట్ రోల్ ఈ సినిమాలో చేశాను. ఈ సినిమా మీకొక బ్యూటిఫుల్ ఎమోషన్స్ అందిస్తుంది' అని తెలిపింది.