Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'గాలోడు'. గెహ్నా సిప్పి హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వం వహించారు. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రం ఈనెల 18న విడుదలై సూపర్ హిట్ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
ఈ సందర్భంగా దర్శకుడు రాజశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, 'ఈ సినిమా పక్కా కమర్షియల్ కంటెంట్ కావడంతో ఈ విజయాన్ని ముందే నేను ఊహించాను. నేను ఇది వరకు కమర్షియల్ డైరెక్టర్ల వద్దే పని చేశాను. నేను పని చేసిన చిత్రాలన్నీ కూడా దాదాపుగా హిట్ అయ్యాయి. అందుకే ఈ సినిమా మీద ముందు నుంచి నమ్మకంగానే ఉన్నాను. నేను సుధీర్‌తో చేసిన 'సాఫ్ట్వేర్ సుధీర్' కమర్షియల్గానూ బాగా ఆడింది. నేను ఆ సినిమాని ఆంధ్రా ఏరియాకి తీసుకుని డిస్ట్రిబ్యూషన్ కూడా చేశాను. అందులో ప్రాఫిట్ వచ్చింది కాబట్టే.. ఈ సినిమాను కూడా నిర్మించాను. ఇందులో కొన్ని డైలాగ్స్, సీన్లకు ఆడియెన్స్ నుంచి ఊహించని మంచి రియాక్షన్స్ వచ్చాయి. ముఖ్యంగా పాటలు, సుధీర్ డాన్స్‌కి, ఫైట్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. డైరెక్షన్‌తో పాటు ప్రొడక్షన్ కూడా చేయడం అనేది చాలా కష్టమైన పని. మా కెమెరామెన్ రామ్ ప్రసాద్ చాలా బిజీ. ఆయన కోసం ఆరు నెలలు ఆగాను. ఎలాగైనా సినిమా బాగా రావాలని ఆయన కోసం ఆగాం. ఇప్పుడు థియేటర్స్‌లో ఆయన విజువల్స్‌కి మంచి రెస్పాన్స్ రావడం హ్యాపీగా ఉంది. 'సాఫ్ట్ వేర్ సుధీర్', 'గాలోడు' సినిమా కథలను రష్మీకి చెప్పాం. కానీ డేట్స్ అడ్జస్ట్ అవ్వలేదు. రష్మీ, సుధీర్ ఇద్దరితో నేను 'గజ్జల గుర్రం' అనే సినిమా చేయాలనుకుంటున్నాను. ఈ సినిమాకు మంచి ప్రశంసలతోపాటు విమర్శలు కూడా వచ్చాయి. వాటిని సరిదిద్దుకుంటాను. కమర్షియల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకోవాలన్నదే నా లక్ష్యం' అని చెప్పారు.