Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి తాజాగా నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ 'వాల్తేర్ వీరయ్య'. బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. పవన్ కళ్యాణ్ తన 'హరిహర వీరమల్లు' చిత్ర దర్శకుడు క్రిష్, నిర్మాత ఎ.ఎం.రత్నంతో కలిసి ఈచిత్ర సెట్‌ని సందర్శించారు.
నేడు (బుధవారం) అధికారికంగా విడుదల కానున్న 'బాస్ పార్టీ' పాటను పవన్ కళ్యాణ్ చూసి ఆనందించారు. దర్శకుడు బాబీ కొల్లి ఈ మెగా మూమెంట్ పై తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, 'ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకునే గొప్ప క్షణం. నా మోస్ట్ ఫేవరెట్ పర్సన్స్ మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కనే ఉన్నాను. కళ్యాణ్ బాస్ పార్టీ పాటను చూశారు. ఆయనకి చాలా నచ్చింది. ఆయన గొప్ప పాజిటివ్ పర్సన్. ఎన్నేళ్ళు గడిచినా అదే ప్రేమ, వాత్సల్యం' అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ షూటింగ్ స్పాట్‌కి వెళ్లి పాటను చూస్తున్న ఫోటోలను ఆయన షేర్ చేశారు. ఈరోజు విడుదలైన ఈ పాట ప్రోమోకు మంచి ఆదరణ లభించింది. దేవి శ్రీ ప్రసాద్ చేసిన మాస్ నంబర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ 'బాస్ పార్టీ' పాటలో చిరంజీవి సరసన ఊర్వశి రౌతేలా సందడి చేయనుంది. నకాష్ అజీజ్, హరిప్రియతో కలిసి డీఎస్పీ పాడిన ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ పాటకు డీఎస్పీ సాహిత్యం అందించడం విశేషం. ఈ సినిమాలో రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తుండగా, జికె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.