Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరో విష్ణు విశాల్ హీరోగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ, స్పోర్ట్స్ డ్రామా 'మట్టి కుస్తీ. ఐశ్వర్య లక్ష్మికథానాయిక. ఆర్ టీ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌పై రవితేజతో కలిసి విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరో విష్ణు విశాల్ చిత్ర విశేషాలను మీడియాతో షేర్ చేసుకున్నారు.
పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్
ఇదొక భార్యా భర్తల ప్రేమ కథ. భార్యాభర్తల మధ్య జరిగే ఇగో కుస్తీ. పెళ్లి తర్వాత భార్యాభర్తలకు కొన్ని అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకోలేనప్పుడు ఇగోలు స్టార్ట్ అవుతాయి. ఇదొక అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కథలో కుస్తీ స్పోర్ట్స్ కూడా భాగంగా ఉంటుంది. కేరళలో మట్టికుస్తీ అనే స్పోర్ట్ ఉంది. సినిమా చాలా వినోదాత్మకంగా ఉంటుంది. నా కెరీర్లో తొలి అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ మసాల సినిమా ఇది.
సర్ప్రైజ్ చేసే ఎలిమెంట్స్..
ఇందులో చాలా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటాయి. స్పోర్ట్ ఇరవై నిమిషాల కంటే ఎక్కువే ఉంటుంది. ఇందులో నేను కబడ్డీ ప్లేయర్‌ని. కానీ కుస్తీ ఆటకి వెళ్తాను. అలా ఎందుకు వెళ్ళాల్సివచ్చిందో.. సినిమా చూసినప్పుడు ఇది చాలా సర్ ప్రైజింగ్‌గా ఉంటుంది. ట్రైలర్లో 'వెయ్యి అబద్దాలాడైన ఒక పెళ్లి చేయమని చెప్పారు. కానీ రెండు అబద్దాలు ఆడి ఈ పెళ్లి చేశాం' అని డైలాగ్ ఉంటుంది. ఆ రెండు అబద్దాలు ఏమిటనేది మీకు సినిమా చూసినప్పుడే తెలుస్తుంది. భిన్న పబ్లిసిటీ ద్వారా ప్రేక్షకుల్లో క్యురియాసిటీని పెంచి థియేటర్లలో చూడాలనే ఆసక్తిని కలిగించే ప్రయత్నం చేశాం.
సందేశం కూడా ..
ఇందులో చాలా కామెడీ ఉంది. ఒక రిలేషన్ షిప్లో ఉన్నపుడు ఖచ్చితంగా ఇగో ఉంటుంది. అయితే ఇందులో ఆడ, మగ సమానమని చెప్పే సందేశం కూడా ఉంది. అయితే దీన్ని ఒక సందేశంగా కాకుండా వినోదాత్మకంగా చెప్పాం. మహిళా ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని చాలా ఇష్టపడతారు. ఇందులో మునిష్ కాంత్, కరుణ, కింగ్స్లి పాత్రలు వినోదాత్మకంగా ఉంటే, తెలుగు నటులు అజరు విలన్‌గా చేశారు. శత్రు మరో నెగిటివ్ పాత్రలో కనిపిస్తారు.
రవితేజ నన్ను నమ్మారు
'ఎఫ్ఐఆర్' సినిమాని తెలుగులో విడుదల చేసే సమయంలో ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ద్వారా రవితేజని కలిశాను. నేను చేసే సినిమాలు ఆయన బాగా నచ్చాయి. 'ఎఫ్ఐఆర్' ట్రైలర్ కూడా ఆయనకి చాలా బాగా నచ్చింది. ఆ సినిమాని ఆయనే ప్రజంట్ చేశారు.. ఆ సమయంలోనే తర్వాత ఏం చేస్తున్నావని అడిగారు. అప్పుడు ఈ లైన్ చెప్పాను. అది వినగానే ఖచ్చితంగా విజయం సాధిస్తుందని, ప్రొడ్యూస్ చేస్తానని చెప్పారు. అలా మా జర్నీ మొదలైంది. రవితేజ నన్ను ఎంతో నమ్మారు. ఆయన నమ్మకం నాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఆయనకి నా మనసులో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది.
రజనీకాంత్ లాల్ సలామ్‌లో..
ప్రస్తుతం నా నిర్మాణంలో మూడు సినిమాలు ఉన్నాయి. మోహన్ దాస్ చిత్రం చిత్రీకరణలో ఉంది. సత్యజ్యోతి దర్శకత్వంలో ఓ సినిమా, జనవరిలో మరో సినిమా ప్రకటన వస్తుంది. అలాగే రజనీకాంత్ 'లాల్ సలామ్' చిత్రంలో నటిస్తున్నా.