Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ముఖచిత్రం'. ఈ సినిమాలో హీరో విశ్వక్ సేన్ ఓ కీలక పాత్ర పోషించారు. 'కలర్ ఫొటో' చిత్ర దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. ఈ చిత్రాన్ని నిర్మాత ఎస్కేఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మించారు. గంగాధర్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మీడియాతో రచయిత, దర్శకుడు సందీప్ రాజ్ మాట్లాడుతూ, 'లాక్డౌన్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. నేను చదివిన కొన్ని న్యూస్ ఆర్టికల్స్ ఆధారంగా, నా అభిమాన దర్శకుడు బాలచందర్ సినిమాలోని ఓ సందర్భాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ కథ సిద్ధం చేసుకున్నాను. ఒక ప్లాస్టిక్ సర్జన్ ప్రమాదంలో గాయపడిన తన ప్రియురాలి ముఖానికి మరొకరి ముఖాన్ని అమర్చుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. పాండమిక్ తర్వాత ప్రేక్షకులు పెద్ద పెద్ద చిత్రాలను మాత్రమే చూసేందుకు వస్తున్నారు అని అంటున్నారు కానీ ఈ సినిమా ఆ సెంటిమెంట్‌ని బ్రేక్ చేస్తుందని నమ్మకంగా ఉన్నాం' అని చెప్పారు.
'కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే మంచి సందేశాన్నిచ్చే సినిమా ఇది. సినిమాలో చాలా ఆసక్తికర అంశాలుంటాయి. థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా ఇది' అని దర్శకుడు గంగాధర్ అన్నారు.