Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నయనతార నాయికగా నటించిన హారర్ థ్రిల్లర్ 'కనెక్ట్'. ఈ సినిమాను ఈ నెల 22న యూవీ క్రియేషన్స్ తెలుగులో గ్రాండ్‌గా విడుదల చేస్తోంది. ఈ చిత్రానికి అశ్విన్ శరవణన్ దర్శకుడు. హారర్ థ్రిల్లర్ మూవీస్ రూపొందించడంలో పేరున్న ఈ దర్శకుడు గతంలో నయనతార నాయికగా 'మయూరి', తాప్సీ హీరోయిన్గా 'గేమ్ ఓవర్' చిత్రాల్ని తెరకెక్కించి మంచి విజయాలు అందుకున్నారు. 'కనెక్ట్' రిలీజ్‌కు రెడీ అవుతున్న సందర్భంగా దర్శకుడు అశ్విన్ శరవణన్ శనివారం మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు. 'లాక్ డౌన్ వల్ల ఓ తల్లీ కూతురు ఇంట్లోనే ఉండిపోతారు. కొద్ది రోజులకు కూతురి ప్రవర్తనలో అనూహ్య మార్పులు వస్తాయి. ప్రేతాత్మ ఆవహించినట్లు ఆమె బిహేవ్ చేస్తుంటుంది. అలాంటి పరిస్థితుల్లో బిడ్డను తల్లి ఎలా కాపాడుకుంది అనేది ఈ సినిమా కథ. గూస్ బంప్స్ తెప్పించే హారర్ థ్రిల్లర్ ఇది. ఇందులో చర్చి ఫాదర్‌గా అనుపమ్ ఖేర్ అత్యంత సహజంగా నటించారు. హాలీవుడ్ చిత్రాల్లో సినిమాకు ఇంటర్వెల్ ఉండదు. కథలోని ఫీల్ పోతుందని వారు విరామాలు పెట్టరు. ఒక ఫ్లోలో వెళ్తున్న కథకు విరామం ఇస్తే ప్రేక్షకులు డైవర్ట్ అవుతారు. ఈ చిత్రంలోనూ ఇంటర్వెల్ ఉండదు. సినిమా నిడివి గంటన్నర ఉంటుంది కాబట్టి చూడటం సులువు. అలాగే ప్రేక్షకులు ఆదరిస్తే ఇలాంటి పద్ధతిలో మరిన్ని సినిమాలు రూపొందుతాయి. అప్పుడు థియేటర్లో ఆరేడు షోస్ ప్రదర్శించే వీలు కూడా కలుగుతుంది. నయనతారతో గతంలో మాయా (తెలుగులో మయూరి) అనే చిత్రాన్ని రూపొందించాను. దర్శకుడిగా నేనంటే ఆమెకు నమ్మకం. అందుకే మళ్లీ ఈ సినిమాను ఆమెతోనే చేశాను. ఈ కథ విన్నాక ఆమెకు బాగా నచ్చింది. దీన్ని ఒక అంతర్జాతీయ స్థాయి చిత్రంగా నిర్మించాలన్నది ఆమె కోరిక. అందుకే విఘ్నేష్‌తో కలిసి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసింది. ఈ సినిమాలోని ప్రతి సీన్లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకి పథ్వీ ఎక్స్లెంట్ మ్యూజిక్ ఇచ్చారు. ప్రేక్షకులను చూపు తిప్పుకోనివ్వకుండా ఉండే సినిమాలను రూపొందించడం అంటే నాకెంతో ఇష్టం. అలాగే టాలీవుడ్లో నాని సినిమాలంటే ఇష్టం. ఆయనకు గతంలో 'మయూరి' కథ చెప్పాను. తనే సినిమా ప్రొడ్యూస్ చేస్తానన్నాడు. ఆయనతో ఒక సినిమా రూపొందించాలని ఉంది' అని అశ్విన్ శరవణన్ అన్నారు.