Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిర్మాతల మండలిలో తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని కౌన్సిల్లో సభ్యులుగా ఉన్న కొంతమంది నిర్మాతలు సోమవారం హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలో రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ మోహన్ గౌడ్, రామకృష్ణ గౌడ్, గురురాజ్, యలమంచిలి రవిచందర్, రవీంద్ర గోపాల్, మిత్తాన ఈశ్వర్, డి.వి.గోపాల్ రావు, బానూరి నాగరాజు, పి.వీరారెడ్డి, వరప్రసాద్‌తో పాటు అనేక మంది నిర్మాతలు ఈ రిలే నిరాహార దీక్ష శిబిరంలో పాల్గొని, మీడియా సమావేశంలో వారి ఆవేదనను తెలియజేశారు.
ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ మోహన్ గౌడ్ మాట్లాడుతూ, 'కౌన్సిల్లోకి ఒక వ్యక్తి ప్రవేశించినప్పటి నుంచి సిస్టమ్ గాడి తప్పింది. దీన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. ఎన్నికలు జరపాలని అధ్యక్షులు కళ్యాణ్‌కి తెలియజేస్తే 15 రోజుల్లో ఎన్నికల్లు స్టార్ట్ చేస్తామని చెప్పి, ఇప్పటికీ నిర్వహించలేదు. గట్టిగా నిలదీస్తే యాన్యువల్ రిపోర్ట్ బుక్‌లో ఇంకా కరెక్షన్స్ ఉన్నాయని సాకులు చెబుతున్నారు. ఈ పరిణామాలతో నేను ఈ కౌన్సిల్‌కి జాయింట్ సెక్రటరీ ఎందుకయ్యానా.. అని మధన పడుతున్నాను. వీటిని వ్యతిరేకిస్తున్న మమ్మల్ని ఏదో ఒక కేసులో ఇరికించాలని చూస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు' అని తెలిపారు.