Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ, త్రినాథరావు నక్కిన కాంబోలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ధమాకా'. శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈనెల 23న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు.
రవితేజ మాట్లాడుతూ,'ఈ సినిమా ఖచ్చితంగా బావుంటుంది. ప్రసన్న హ్యుమర్ నాకు చాలా ఇష్టం. ఇందులో చాలా అద్భుతంగా రాశాడు. దర్శకుడు త్రినాథరావు ఇరగదీశారు. విశ్వ ప్రసాద్, వివేక్. అభిషేక్ అగర్వాల్ ఎక్కడా రాజీ పడకుండా సినిమాలు తీస్తారు' అని తెలిపారు.
'ఈ సినిమా అదిరిపోయింది. మాములుగా లేదు. నేను రవితేజ ఫ్యాన్నే. ఆయన ఏం చేస్తే థియేటర్లలో ఎగిరి గంతేస్తారో ఈ సినిమా చూస్తున్నప్పుడు అలాగే ఎగిరిగెంతాను. డైలాగులు మాములుగా లేవు. ఆడియన్స్ కాదు.. సీట్లు లేస్తాయి. డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది. అంచనాలకు మించి వుంటుంది' అని దర్శకుడు త్రినాథరావు నక్కిన అన్నారు.
నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ,'రవితేజ గొప్ప స్ఫూర్తి. ప్రసన్న, త్రినాథరావు నక్కినకి కృతజ్ఞతలు. తెలుగమ్మాయి శ్రీలీల మా సినిమాలో చేయడం ఆనందంగా ఉంది. ధమాకా లాంటి బిగ్ కమర్షియల్ హిట్ మూవీలో భాగమైన అందరికీ కృతజ్ఞతలు' అని తెలిపారు.
'రవితేజ మామూలోడు కాదు. పీపుల్ మీడియా నా మాతృ సంస్థ లాంటింది. వివేక్, విశ్వ, అభిషేక్ ఏ సినిమా చేసినా నన్ను పిలుస్తారు. భీమ్స్ పాటలు అద్భుతంగా ఉన్నాయి. ఇది పెద్ద విజయం సాధించాలి' అని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అన్నారు.