Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ హీరో, హీరోయిన్లుగా రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం 'శాసనసభ'. ఈ చిత్రాన్ని సాబ్రో ప్రొడక్షన్స్ పతాకంపై తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని నిర్మించారు.
వేణు మడికంటి దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రేక్షకాదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా దర్శకుడు వేణు మడికంటి మాట్లాడుతూ, 'ఇంద్రసేనను యాక్షన్ హీరోగా నిలబెట్టాలని ప్రయత్నించాను. ఇంద్రసేన యాక్షన్ సీక్వెన్స్‌లు బాగా చేశాడని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. చిత్రీకరణ సమయంలో రాజేంద్ర ప్రసాద్ ఇచ్చిన సహకారం మర్చిపోలేను. మేము ఆశించిన ఫలితం దక్కింది' అని అన్నారు. 'నాకు తెలియని వారెవరో ఫోన్స్ చేసి సినిమా చూశాం, బాగుందని అంటున్నారు. ఇలా ప్రేక్షకుల మౌత్ టాక్ వల్ల మా చిత్రానికి వసూళ్లు పెరుగుతున్నాయి' అని హీరో ఇంద్రసేన చెప్పారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, 'మంచి సినిమాను ప్రేక్షకులు వదులుకోరు. తప్పకుండా ఆదరిస్తారు. విడుదలైన మూడో రోజున 60 థియేటర్స్ పెరిగాయంటే ఊరికే కాదు కదా. సినిమా అందరికీ నచ్చితేనే థియేటర్స్ పెంచుతారు. నారాయణ స్వామి పాత్రలో నా నటనకు పేరొచ్చిందంటే దానికి మొదటి కారణం రచయిచ, తర్వాత దర్శకుడు. క్రెడిట్లో మూడో స్థానం నాది' అని తెలిపారు.