Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1990లో సామాజిక స్థాయి బేధాలు, పరువు హత్యలు ప్రేమికుల పాలిట శాపాలుగా నడుస్తున్న కాలంలో కట్టుబాట్లకి, సాంప్రదాయాలకి ప్రేమ అతీతమైనదని అమ్మవారే సాక్షిగా నిలిచి, గెలిపించిన సరికొత్త ప్రేమ కథే 'ఎర్ర గుడి'. అమ్మవారి సాక్షిగా అల్లుకున్న ప్రేమ కథ అనేది ట్యాగ్‌లైన్.
అన్విక ఆర్ట్స్ వారి ఈ చిత్ర ప్రారంభోత్సవం సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. హీరో వెంకట్ కిరణ్, హీరోయిన్ శ్రీజిత ఘోష్‌పై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు క్లాప్ కొట్టగా, ప్రొడ్యూసర్ జెవిఆర్ కెమెరా స్విచాన్ చేశారు.
సీనియర్ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తొలి షాట్‌కి దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ,'ఈ సినిమా లవ్, సెంటిమెంట్, స్పిరిచ్యువల్ అంశాలతో ఉంటుంది. 1975 ప్రాంతంలో కథ మొదలై 1992తో పూర్తి అవుతుంది. గ్రామీణ నేపథ్యంలో అమ్మవారి చుట్టూ అల్లుకున్న ప్రేమకథ ఇది. మార్చి నెలాఖరుకు ఈ సినిమాని పూర్తి చేస్తాం' అని అన్నారు.
హీరో వెంకట్ కిరణ్ మాట్లాడుతూ, 'ఒక పవర్ఫుల్ స్టోరీలో హీరోగా చేసే అవకాశం కల్పించినందుకు దర్శకుడు సంజీవ్‌కి థ్యాంక్స్' అని తెలిపారు. 'తెలుగులో నేను చేస్తున్న మరో మంచి సినిమా ఇది. రెండు వేరియేషన్స్ ఉన్న హీరోయిన్ పాత్ర పోషిస్తున్నాను' అని హీరోయిన్ శ్రీజిత ఘోష్ చెప్పారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గోరెంట శ్రావణి మాట్లాడుతూ,'మంచి కథ, చక్కని నటీనటులు, సీనియర్ సాంకేతిక నిపుణులతో చేస్తున్న ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. మా దర్శకుడు సంజీవ్‌గారు చక్కటి ప్రణాళికతో ఈ సినిమా చేస్తున్నారు. ఈ రోజు నుంచే శరవేగంగా షూటింగ్ నిర్వహిస్తున్నాం' అని అన్నారు.