Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవరస నట శిఖరం..
యముడు అంటే ... బహుశా కైకాల సత్యనారాయణలాగే ఉంటారేమో అనేంతలా యముడి పాత్రలు పోషించి భళా అనిపించుకున్నారు. యముండ.. అంటూ ఆయన గర్జించే గర్జన ఇప్పటికీ మరువలేనిది. యముడి పాత్రలో కైకాలను తప్ప మరొకరిని ఊహించుకోలేము అనేంతగా యముడిగా తన విశ్వరూపాన్ని చూపించారు కైకాల. ఆరు దశాబ్దాలుగా భిన్న పాత్రలు, వైవిధ్యమైన చిత్రాలతో మెప్పించిన అరుదైన నవరస నటశిఖరం కైకాల. నటుడిగా, నిర్మాతగా, ప్రజానాయకుడిగా అన్నింటికిమించి నవరస నట సార్వభౌముడిగా ప్రజల మనసులపై చెరగని సంతకం చేశారు. ఇంతటి గొప్ప నటుడిని కోల్పోయిన విషాదంలో సినీ పరిశ్రమ మునిగిపోయింది. కైకాల ఇకలేరు అనే వార్తను ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పలువురు సినీ ప్రముఖులు సైతం ఆయనతో తమకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగంతో కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు సినీ చరిత్రలో ఓ సువర్ణాధ్యాయాన్ని లిఖించిన కైకాల సత్యనారాయణ సినీ జీవిత ప్రస్థానంలోని విశేషాలు..
- కృష్ణాజిల్లా కౌతవరం గ్రామంలో 1935 జూలై 25న కైకాల సత్యనారాయణ జన్మించారు. గుడ్లవల్లేరులో ప్రాధమిక విద్యను, విజయవాడలో ఇంటర్మీడియట్‌ను, గుడివాడ కాలేజీలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు. నటనపై ఉన్న ఆసక్తితో కాలేజీ రోజుల్లోనే ఆయన నాటక రంగంలోకి ప్రవేశించి 'పల్లెపడుచు', 'బంగారు సంకెళ్ళు', 'ప్రేమలీలలు', 'కులం లేని పిల్ల', 'ఎవరు దొంగ' వంటి తదితర ఎన్నో నాటకాల్లో విలన్‌గా, కథానాయకుడిగా మెప్పించారు. ఆ టైమ్‌లో స్నేహితుడు కె.ఎల్.ధర్ సలహా మేరకు సినిమాల్లో ప్రయత్నాలు చేసేందుకు మద్రాస్ వెళ్ళారు.
- తొలుత ప్రసాద్ ప్రొడక్షన్స్‌లో సహాయ కళా దర్శకుడిగా సినీ జీవితాన్ని ప్రారంభించారు. 'కొడుకులు కోడళ్ళు' సినిమా కోసం కైకాలకు దర్శక, నిర్మాత ఎల్.వి.ప్రసాద్ స్క్రీన్ టెస్టులు నిర్వహించి, ఓకే చేశారు. అయితే ఆ సినిమా ప్రారంభం కాలేదు. ఆ తరువాత బి.ఎ.సుబ్బారావు సూచన మేరకు దర్శక, నిర్మాత కెవి.రెడ్డిని కలిశారు. ఆయన కూడా మేకప్ టెస్ట్ చేసి కూడా అవకాశం కల్పించలేకపోయారు. అయితే నటనలో కైకాలకు ఉన్న ప్రతిభను గమనించిన 'దేవదాసు' నిర్మాత డి.ఎల్.నారాయణ 'సిపాయి కూతురు' చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. దీంతో కైకాలకు ఏ సినిమాలోనూ నటించే అవకాశం లభించలేదు.
- అవకాశాలు లేకపోవడంతో కొన్ని సినిమాల్లో ఎన్టీఆర్‌కు డూపుగా నటించారు. ఎన్టీఆర్ పోలికలు ఉండటంతో కైకాలకు బాగా కలిసొచ్చింది. ఎన్టీఆర్ చొరవతోనే 'సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి'లో అతిథి పాత్రలో మెరిశారు. ఆ తర్వాత విఠలాచార్య 'కనకదుర్గ పూజా మహిమ'లో సేనాధిపతి పాత్రతో మెప్పించారు. ఈ పాత్ర కైకాల కెరీర్‌ను నిలబెట్టింది. చిన్నా, పెద్ద పాత్రలతో సంబంధం లేకుండా తనకు వచ్చిన ప్రతి అవకాశాన్నీ కైకాల సద్వినియోగం చేసుకుని తిరుగులేని నటుడిగా ఎదిగారు.
- 'స్వర్ణగౌరి'లో శివుడిగా, 'మదనకామరాజు'లో ధర్మపాలుడిగా, 'శ్రీకృష్ణార్జున యుద్ధం'లో కర్ణుడిగా, 'నర్తనశాల'లో దుశ్శాసనుడిగా, విఠలాచార్య 'అగ్గిపిడుగు'లో రాజనాల ఆంతరంగి కునిగా, 'శ్రీకృష్ణావతారం', 'కురుక్షేత్రం'లో సుయోధనుడిగా, 'దాన వీర శూర కర్ణ'లో భీముడిగా, 'సీతాకళ్యాణం'లో రావణాసురుడిగా, ఘటోత్కచుడుగా అసమాన నటన ప్రదర్శించారు. కేవలం పౌరాణిక పాత్రలే కాదు, 'అడవిరాముడు', 'వేటగాడు', 'ప్రేమనగర్' వంటి తదితర ఎన్నో సాంఘిక చిత్రాల్లోని పాత్రలతోనూ మెప్పించారు. 13 చిత్రాల్లో హీరోగా తర్వాత ప్రతినాయకుడిగానూ అలరించారు. ఆ తర్వాత తండ్రిగా, తాతగా, ఇంటి పెద్దగా ఇలా.. భిన్న పాత్రలతో క్యారెక్టర్ ఆర్టిస్టూగానూ భేష్ అనిపించుకున్నారు.
- ఎన్టీఆర్, ఏయన్నార్ల దగ్గర్నుంచి రజనీకాంత్, కమల్‌హాసన్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున.. ఇలా ఆనాటి యువ కథానాయకులకు ప్రతినాయకుడు అంటే సత్యనారాయణే. రావుగోపాలరావు, నూతన ప్రసాద్‌లతో కలిసి విలన్‌గా తెరను పంచుకున్నారు. ఎస్వీరంగారావు మరణానంతరం ఆయన పోషించాల్సిన గంభీరమైన పాత్రలు ఎక్కువగా కైకాలను వరించాయి. అటు పౌరాణికం, ఇటు జానపదం, సాంఘిక చిత్రాల్లో శక్తివంతమైన పాత్రలు దక్కాయి.
- రమా ఫిలిమ్స్ పేరిట చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించిన సత్యనారాయణ 'గజదొంగ', 'ఇద్దరు దొంగలు', 'కొదమ సింహం', 'బంగారు కుటుంబం', 'ముద్దుల మొగుడు' వంటి తదితర చిత్రాలను నిర్మించి అభిరుచిగల నిర్మాతగానూ పేరు పొందారు. వీటిల్లో కొన్ని చిత్రాలకు చిరంజీవి సహ నిర్మాతగా వ్యవహరించడం విశేషం. ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'కేజీఎఫ్' సిరీస్‌కి నిర్మాత కైకాల తనయుడు రామారావు కావడం విశేషం.
- కైకాల కెరీర్లో చిన్నా, పెద్దా వేషాలు కలిపి 800లకు పైగా పాత్రలు పోషించారు. మహేష్‌బాబు నటించిన 'మహర్షి' చిత్రం ఆయన చివరి సినిమా. 28 పౌరాణిక, 51 జానపద, 9 చారిత్రక చిత్రాల్లో ఆయన నటించారు. ఒక్క ఎన్టీఆర్తోనే దాదాపు 100కి పైగా చిత్రాల్లో నటించటం ఓ రికార్డ్. సుమారు 200 మంది ప్రముఖ దర్శకులతోనూ పని చేశారు. వీరిలో ఎక్కువ శాతం రాఘవేంద్రరావు, కె.ఎస్.ఆర్.దాస్, దాసరి దర్శకత్వంలో చేశారు. అలాగే చిత్రపరిశ్రమలో తనకు గాడ్ ఫాదర్ లాంటి ఎన్టీఆర్ దర్శకత్వంలో 11 సినిమాల్లో నటించారు.
- ఆయన నటనకు 'కళా ప్రపూర్ణ', 'నవరస నటనా సార్వభౌమ' వంటి ఎన్నో బిరుదులు వచ్చాయి. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం సత్యనారాయణకు గౌరవ డాక్టరేటు ప్రదానం చేయగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డుతో సత్కరించింది. 'బంగారు కుటుంబం' చిత్రానికి ఉత్తమ సినిమాగా నంది అవార్డు దక్కించుకున్నారు. తన విలక్షణతో నటనతో వెండితెరపైనే కాకుండా ప్రజలకు సేవ చేసి నాయకుడిగా రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేశారు సత్యనారాయణ. తెలుగు దేశం తరఫున 1996లో మచిలీపట్నం నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.