Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు చిత్ర సీమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కృష్ణంరాజు, కృష్ణ, కైకాల సత్యనారాయణ వంటి మహామహుల మరణ వార్తల నుంచి తేరుకోక ముందే చలపతిరావు (78) వంటి మరో గొప్ప విలక్షణ నటుడిని పరిశ్రమ కోల్పోయింది. తెలుగు సినిమా చరిత్రలో తమదైన శైలిలో సువర్ణాధ్యాయాలను లిఖించిన హేమాహేమీలు ఒక్కొక్కరిగా తరలిపోవడం అత్యంత బాధాకరం. ఐదున్నర దశాబ్దాలుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడీయన్‌గా, ప్రతినాయక ఛాయలున్న విభిన్నమైన పాత్రలతో చలపతిరావు ప్రేక్షకులను అలరించారు. దాదాపు 1500ల చిత్రాల్లో నటించిన ఆయన మూడుతరాల నటీనటులతో స్క్రీన్ షేర్ చేసుకుని ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. డైలాగ్ డెలివరీ, పాత్రకు తగ్గ మ్యానరిజంతో మెప్పించడం ఆయనలో ప్రత్యేకత. అభిరుచిగల నిర్మాతగా అన్నింటికి మించి అందరూ బాబారు అని ఆప్యాయంగా పిలుచుకునే చలపతిరావు ఇకలేరనే వార్తను ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి గుండెపోటుతో తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. విలక్షణ నటుడిగా వెండితెరపై ఓ వెలుగు వెలిగిన చలపతిరావు సినీ జీవిత ప్రస్థానంలోని కొన్ని ముఖ్య విశేషాలు..
చలపతిరావు పూర్తి పేరు తమ్మారెడ్డి చలపతిరావు. కృష్ణాజిల్లా పామర్రు మండలంలోని బల్లిపర్రు గ్రామంలో 1944 మే 8న జన్మించారు. చలపతిరావు తండ్రిపేరు మణియ్య. తల్లి పేరు వియ్యమ్మ. భార్య పేరు ఇందుమతి. ముగ్గురు పిల్లలు పుట్టిన కొన్నేళ్లకే చలపతిరావు భార్య అగ్ని ప్రమాదంతో మరణించారు. భార్యకి ఇచ్చిన మాటని నిలబెట్టుకునేందుకు చలపతిరావు మరో పెళ్లి చేసుకోలేదు. కుమార్తెలు మాలినీదేవి, శ్రీదేవి ఇద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు. కుమారుడు రవిబాబు టాలీవుడ్లో నటుడిగా, దర్శకుడిగా గుర్తింపు పొందారు.
చిన్నప్పట్నుంచే చలపతిరావుకు నటనపై ఎంతో ఆసక్తి ఉండేది. నాటకరంగంలో మంచి అనుభవం పొందారు. 1966లో ఆయన చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. కృష్ణ 'గూఢచారి 116' ఆయన నటించిన తొలి చిత్రం. ఆ తర్వాత 'సాక్షి', 'బుద్ధిమంతుడు' చిత్రాల్లో పోషించిన పాత్రలతో కెరీర్ పరంగా ఆయన వెనుదిరిగి చూసింది లేదు. వరుస చిత్రాలు, విజయాలతో ముందుకుసాగారు. విలన్, రేపిస్ట్ పాత్రలకు పెట్టింది పేరుగా గుర్తింపు పొందారు.
'నిన్నేపెళ్లాడతా' చిత్రంలో నాగార్జునకు తండ్రిగా నటించడం ఆయన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్. నటుడిగానే కాకుండా నిర్మాత గానూ ఆయన సత్తా చాటారు. 'జగన్నాటకం', 'కలియుగ కృష్ణుడు', 'కడపరెడ్డమ్మ', 'పెళ్లంటే నూరేళ్ల పంట', 'ప్రెసిడెంటుగారి అల్లుడు', 'అర్థరాత్రి హత్యలు', 'రక్తం చిందిన రాత్రి' వంటి తదితర చిత్రాలను నిర్మించారు.
సీనియర్ ఎన్టీఆర్‌తో చలపతిరావుకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఎన్టీఆర్‌తో ఆయన నటించిన తొలి చిత్రం 'కథానాయకుడు'. 'యమగోల', 'యుగపురుషుడు', 'డ్రైవర్ రాముడు', 'అక్బర్ సలీమ్ అనార్కలి', 'భలే కృష్ణుడు', 'సరదా రాముడు', 'జస్టిస్ చౌదరి', 'బొబ్బిలి పులి', 'చట్టంతో పోరాటం', 'కొండవీటి దొంగ', 'దొంగ రాముడు', 'సింహాద్రి', 'బన్నీ', 'ఆది', 'బొమ్మరిల్లు, 'అరుంధతీ' 'సింహా', 'లెజెండ్', వంటి తదితర చిత్రాల్లో తనదైన శైలి పాత్రలతో మెప్పించడమే కాకుండా మూడు తరాల నటీనటులతోనూ నటించి అలరించారు.
'బంగార్రాజు' తర్వాత ఆయన తెరపై కనిపించలేదు. రెెండు రోజుల క్రితం కూడా చలపతిరావు తన తనయుడు రవిబాబు తెరకెక్కిస్తున్న ఓ చిత్రంలో నటించారు. తన జీవితంలో జరిగిన రెండు మూడు సంఘటనల ఆధారంగా దర్శకుడు ఈ.వి.వి.సత్యనారాయణ 'మా నాన్నకు పెళ్లి' తెరకెక్కించారు.
చిరంజీవి, బాలకృష్ణ, పవన్‌కళ్యాణ్, ఎన్టీఆర్, ముత్యాల సుబ్బయ్య వంటి పలువురు సినీ ప్రముఖులు చలపతిరావుతో తమకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. వీరితోపాటు పలువురు నటీనటులు సోషల్ మీడియా వేదికగా చలపతిరావు మృతిపట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
బుధవారం చలపతిరావు అంత్యక్రియలను జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో నిర్వహించనున్నట్లు తనయుడు రవిబాబు చెప్పారు.