Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుదర్శనం ప్రొడక్షన్స్‌లో 'జయహో రామానుజ' చిత్రాన్ని లయన్ డా. సాయివెంకట్ నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రానికి సాయిప్రసన్న, ప్రవల్లిక నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి బి.సి. కమీషన్ ఛైర్మెన్ వకుళాభరణం కష్ణ మోహన్, ఎఫ్డిసి చైర్మెన్ కూర్మాచలం అనీల్ కుమార్, తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి, తెలుగు ఫిలిం ఛాంబర్ జనరల్ సెక్రటరీ ప్రసన్నకుమార్, సుమన్, సింగర్ పద్మ, తుమ్మల రామసత్యనారాయణ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఈ సందర్భంగా దర్శక, నిర్మాత సాయి వెంకట్ మాట్లాడుతూ, 'ఈ సినిమాను జనవరిలో ప్రారంభించి, డిసెంబర్లో పూర్తి చేశాను. ఇప్పటికి రెండు పార్టులకు సంబంధించిన కంటెంట్ వచ్చింది. దాదాపు ఐదు గంటల సినిమా వచ్చింది. ఈ సినిమాకు 'బాహుబలి', 'బింబిసార' రేంజ్లో వీఎఫ్ఎక్స్ ఉంటుంది. రామానుజుల వారి మీద ఇప్పటి వరకు ఐదు సినిమాలు వచ్చాయి. కానీ ఏవీ కూడా థియేటర్ల వరకు రాలేదు. టెక్నికల్‌గా ఈ సినిమాను అద్భుతంగా తీశాం. ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని భావిస్తున్నాం. అశ్వనీదత్‌లా నా కూతుర్లని కూడా సినిమా రంగంలోకి తీసుకొచ్చాను. ఈ సినిమాలో నాలుగు పాత్రలను నా కూతురు పోషించింది. సుమన్ ఢిల్లి రాజు పాత్ర చేశారు. రామానుజుల భార్యగా జో శర్మ చక్కగా నటించారు' అని తెలిపారు.
'రామానుజం పాత్రకు సాయి వెంకట్ గెటప్ బాగా సెట్ అయింది. నేను వేసిన ఢిల్లీ రాజు కారెక్టర్ చాలా బాగా వచ్చింది. సాయివెంకట్ కూతుర్లు అమ్మాయిలైనా కూడా అబ్బాయిల్లా సెట్లో పని చేశారు. ఇలాంటి ఆధ్యాత్మికమైన పాత్రలు చేయాలని ఉంటుంది. కానీ పై నుంచి ఆ దేవుడి పర్మిషన్ కావాలి. అన్నమయ్య సమయంలోనూ నా పాత్ర కోసం చాలా మందిని అడిగారు. కానీ ఆ వెంకటేశ్వరుడి స్వామి నాకు మాత్రమే ఛాన్స్ ఇచ్చారు' అని సుమన్ చెప్పారు.