Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్లలో ఒకటిగా నిలిచిన చిత్రం 'ఖుషి'. పవన్ కళ్యాణ్, భూమిక చావ్లా జంటగా నటించిన ఈ చిత్రం 2001లో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఈనెల 31న ప్రపంచవ్యాప్తంగా భారీగా రీ-రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
శ్రీ సూర్య మూవీస్ పతాకంపై ఎ.ఎం.రత్నం నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా, పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.
అన్ని రికార్డులను తిరగ రాసిన సినిమానే కాకుండా, అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించిన పవన్ కళ్యాణ్ చిత్రాలలో ఇదొకటి.
రెండు దశాబ్దాల తర్వాత కూడా అదే కొత్త అనుభూతినిస్తోంది. రీ-రిలీజ్ కోసం విడుదల చేసిన ఖుషి ప్రత్యేక ట్రైలర్ అభిమానులను రెండు దశాబ్దాలు వెనక్కి తీసుకెళ్ళింది. ఈ సినిమా వారిపై చూపిన ప్రభావాన్ని, థియేటర్లలో సృష్టించిన ప్రభంజనాన్ని వారు గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ఎ.ఎం.రత్నం మాట్లాడుతూ,'ఇద్దరు వ్యక్తుల ఇగోల చుట్టూ తిరిగే సున్నితమైన కథ అయినప్పటికీ, ఖుషి బయటకు మాత్రం ఒక రెగ్యులర్ రొమాంటిక్ ఫిల్మ్‌లా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి అహం ఉంటుంది. అది మన ఆలోచనలను నిజాయితీగా వ్యక్తపరచకుండా ఆపుతుంది. ఈ సినిమా విడుదలకు ముందే 'తమ్ముడు, తొలి ప్రేమ, బద్రి' వంటి విజయాలతో పవన్ కళ్యాణ్ పెద్ద స్టార్‌గా ఉన్నారు. అయితే దర్శకుడు ఎస్.జె.సూర్య తన ప్రతిభను ఈ సినిమాలో చాలా చక్కగా ఉపయోగించుకున్నారు. నా దృష్టిలో ఖుషి ఎప్పటికీ అద్భుతమైన కథే. వాయిస్ఓవర్ ద్వారా కథను ముందే పరిచయం చేసినా.. ప్రేక్షకులలో ఆసక్తిని ఏమాత్రం తగ్గించకుండా చివరివరకు కూర్చునేలా చేసిన అరుదైన చిత్రం' అని చెప్పారు.