Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ కథానాయకుడు ఆదిసాయికుమార్ నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ 'టాప్ గేర్'. కె.శశికాంత్ దర్శకత్వంలో కె.వి.శ్రీధర్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమా ఈనెల 30న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో ఆది సాయి కుమార్ బుధవారం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాల సమాహారం ఆయన మాటల్లోనే..
నా క్యారెక్టర్ టాప్‌గేర్‌లో ఉంటుంది..
'టాప్ గేర్' కథ నాకు బాగా నచ్చింది. క్యాబ్ డ్రైవర్.. అతని జీవితంలో చిన్న సమస్య.. అది పెద్దగా మారడం.. ఒక్క రోజులో జరిగే కథ. ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. 'టాప్ గేర్' టైటిల్‌ని అందరూ ఎంతో ఆసక్తికరంగా ఉందని చెప్పారు. అయితే ఈ టైటిల్‌ను ముందుగా అనుకోలేదు. కానీ హీరో కారెక్టర్ మాత్రం టాప్ గేర్‌లోనే ఉంటుంది. హీరో టాప్ గేర్ వేయాల్సి వస్తుంది. ఒకసారి టాప్ గేర్ అని అనుకున్నాం. చాలా స్టైలిష్‌గా ఉందని ఆ టైటిల్‌ను ఫిక్స్ చేశాం. డైరెక్టర్ శశికాంత్ చాలా క్లారిటీతో ఉంటాడు. సీనియర్ డీఓపీ సాయి శ్రీరామ్‌కి కూడా ఆ షాట్ అలా తీద్దాం ఇలా తీద్దామని చెబుతుండేవాడు. ఎడిటర్ ప్రవీణ్ పూడి సైతం కంటెంట్ చాలా బాగుందని, బాగా తీశారని ప్రశంసించారు.
అంచనా వేయలేకపోతున్నాం..
ఐడియా కొత్తగా ఉంటేనే నేను సినిమాలను ఎంచుకుంటాను. ఐడియా బాగుంటే సగం సినిమా హిట్ అయినట్టే. మిగతాది అంతా స్క్రీన్ ప్లేలో ఉంటుంది. అయితే జనాలకు ఇప్పుడు ఏది నచ్చుతుందనేది కూడా అంచనా వేయలేకపోతున్నాం. ఈ సినిమా టెక్నికల్‌గా బాగుంటుంది. మ్యూజిక్, కెమెరా వర్క్ అద్భుతంగా ఉంటాయి. ఫైట్ మాస్టర్ పథ్వీ ఫైట్స్ మరో హైలెట్ అవుతాయి. ఈ సినిమా అంతా కూడా కారులోనే ఉంటుంది. కాబట్టి మా ఆర్ట్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ ఆ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు. చాలా బాగా డిజైన్ చేశారు. ఈ సినిమాకు ఆర్ఆర్ చాలా ముఖ్యం. హర్షవర్దన్ రామేశ్వర్ మాకు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఈ సినిమా బాగుందని ఆయన కూడా మెచ్చుకున్నారు. సినిమాలో ఒకే ఒక్క పాట ఉంటుంది. హీరోయిన్ రియాతో వర్క్ చేయటం హ్యాపీగా ఉంది. ఈ సినిమాను హిందీలో డబ్ చేస్తున్నాం. 'గరం' సినిమాతో నార్త్‌లో బాగానే క్రేజ్ వచ్చింది. 'లవ్ లీ, ఆపరేషన్ గోల్డ్ ఫిష్' హిందీ ఆడియెన్స్‌ను బాగానే ఆకట్టుకున్నాయి.
కొత్త కథలు, ప్రయోగాలకూ సిద్ధం
ఇకపై రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను చేయను. రియారిటీకి దగ్గరగా ఉండేవి చేస్తాను. కొత్త కథలు, ప్రయోగాలకూ సిద్ధమే. సర్ప్రైజింగ్ ఏంటంటే, నెగటివ్ రోల్స్‌కి కూడా నన్ను అడుగుతున్నారు (నవ్వుతూ). ప్రస్తుతం జీ5 కోసం నేను చేయబోతున్న వెబ్ సిరీస్‌లో ఎవ్వరూ ఊహించనటువంటి పాత్రను పోషిస్తున్నాను. ప్రస్తుతం లక్కీ మీడియాకు ఓ సినిమా చేస్తున్నాను. జీ5 కోసం చేసిన వెబ్ సిరీస్ షూటింగ్ అయిపోయింది. మొదటి సీజన్లో ఎనిమిది ఎపిసోడ్లు ఉంటాయి.