Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిత్రపురి కాలనీలో గురువారం సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, నిర్మాతలు సి కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, చిత్రపురి కాలనీ అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని, ఎఫ్ డీసీ ఛైర్మన్ అనిల్ కూర్మాచలం, ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి, మణికొండ మున్సిపల్ లీడర్స్ తదితరులు పాల్గొన్నారు. చిత్రపురిలో 1,176 ఎంఐజీ, 180 హెచ్ఐజీ డూప్లెక్స్ ఫ్లాట్స్ ఓనర్స్కు చిరంజీవి చేతుల మీదుగా ఇంటి తాళాలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ, 'తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తోంది. సినీ రంగానికి, ఇక్కడి కార్మికులకు ఎప్పుడూ అండగానే ఉంటున్నాం. మిషన్ భగీరథ పైప్ లైన్ వచ్చేలా చేస్తా. అలాగే చిత్రపురి కాలనీలోనే రేషన్ షాప్, ఆస్పత్రి నిర్మాణం, ఇతర మౌళిక వసతులు కల్పిస్తాం' అని చెప్పారు.
'మా కమిటీ గెలవగానే మిగిలిన గృహ నిర్మాణాలు పూర్తి చేస్తామని వాగ్ధానం చేశాం. మేము మాటిచ్చినట్లుగానే ఇవాళ ఇళ్లు కట్టి ఇవ్వడం సంతృప్తిగా ఉంది' అని చిత్రపురి కాలనీ అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని అన్నారు.
చిరంజీవి మాట్లాడుతూ, 'మా సినీ కార్మికుల సమక్షంలోకి అతిథిగా రావడం సంతోషంగా ఉంది. మనం తిన్నా తినకున్నా మనకొక ఇల్లు ఉండటం అనే తృప్తే వేరు. ఆ సొంతింటి కలను మన సినీ కార్మిక సోదరులకు నిజం చేసిన ఈ చిత్రపురి కమిటీ వారికి అభినందనలు. ఈ సమయంలో మనం గుర్తు చేసుకోవాల్సింది స్వర్గీయ ఎం ప్రభాకర్ రెడ్డి గారిని. ఆయన దూరదృష్టితో ఈ సొసైటీ కోసం చేసిన కృషి ప్రశంసనీయం. ఆయన కల ఇవాళ నెరవేరింది. దాసరి, రాఘవేంద్రరావు, భరద్వాజ లాంటి వారందరూ దీన్నొక అద్భుతమైన సొసైటీగా తీర్చిదిద్దారు. భారత దేశంలో మరే సినీ పరిశ్రమలోనూ సినిమా కార్మికులకు ఇంత పెద్ద గృహసముదాయం లేదు. ఈ కమిటీ చాలా నిజాయితీగా పనిచేస్తుండటం వల్లే పనులు జరుగుతున్నాయి. సినీ కార్మికులకు నేను ఎప్పుడూ అండగా ఉంటాను. అవసరం వచ్చినప్పుడు మీ వెంట ఉండేది నేనే. మీకు కష్టం వస్తే నా ఇంటి తలుపు తట్టండి' అని తెలిపారు.