Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'వీరసింహారెడ్డి. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12 విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి మాటలు అందించిన రైటర్ సాయి మాధవ్ బుర్రా శుక్రవారం మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
'ఇందులో పక్కా మాస్ డైలాగ్స్ ఉంటాయి. బాలకృష్ణని అభిమానులు ఎలా చూడాలని కోరుకుంటారో, ఎలాంటి డైలాగ్స్ వినాలని అనుకుంటారో అన్నీ ఇందులో ఉంటాయి. బాలయ్యతో 'గౌతమీపుత్రశాతకర్ణి, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు' చేశాను. ఇప్పుడు 'వీరసింహారెడ్డి'. కథని, పాత్రని, సన్నివేశాన్ని , హీరో ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని అన్నింటిని బ్యాలెన్స్ చేస్తూ రాస్తాను. ఈ సినిమా కథే కొత్తది. ఈ కథలో ప్రేక్షకులు ఇంతకుముందు చూడని ఓ అద్భుతమైన కొత్త పాయింట్ ఉంది. కథలో ఉన్న సోల్‌ని ఎలివేట్ చేయడానికి ప్రతి రచయిత కష్టపడతాడు. పైగా 'వీరసింహారెడ్డి' కొత్త కథ. ఇందులో అద్భుతమైన సోల్ ఉంది. ఈ పాయింట్ వింటే ఎవరైనా స్ఫూర్తి పొందుతారు. ఒక పక్కా కమర్షియల్ సినిమాకి ఇలాంటి కథ చాలా అరుదుగా దొరుకుతుంది. ఈ కథలో అద్భుతమైన ఎమోషన్ ఉంది. దర్శకుడు గోపిచంద్‌తో నాకిది రెండో సినిమా. ఆయన అద్భుతమైన డైరెక్టర్. భవిష్యత్‌లో ప్రపంచం మొత్తం మాట్లాడుకునే స్థాయిలో ఉంటారు. గతంలో బాలకృష్ణ గౌతమీపుత్రశాతకర్ణి, చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150'కి నేనే రాశాను. రెండూ సంక్రాంతికి విడుదలయ్యాయి. ఇప్పుడు కూడా మరోసారి బాలకృష్ణ, చిరంజీవి సినిమాలు వస్తున్నాయి. ఇదో పండగ. చిరంజీవి సినిమాకి నేను రాయకపోయినా అదీ నా సినిమానే. నేను చూసిన నిర్మాతల్లో అద్భుతమైన నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్. ప్రస్తుతం ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె', హరిహర వీరమల్లు, రామ్ చరణ్- శంకర్ సినిమా, అర్జున్ సినిమా, కెఎస్ రామారావుతో ఒక సినిమా చేస్తున్నాను' అని తెలిపారు.