Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సినీ పాత్రికేయుడిగా, గీత రచయితగా తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న పెద్దాడ మూర్తి (51) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం హైదరాబాద్లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య సంధ్య, పిల్లలు సుగాత్రి, అభిజిత్ ఉన్నారు.
కొంతకాలం పాటు సినీ పాత్రికేయుడిగా పని చేసిన పెద్దాడ మూర్తి సినీ గీత రచయితగా తన ప్రయాణం మొదలుపెట్టారు.
చిరంజీవి నటించిన 'స్టాలిన్', పూరీ జగన్నాథ్, రవితేజ కాంబినేషన్లో సంచలన విజయం సాధించిన 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి', కృష్ణవంశీ 'చందమామ' వంటి తదితర చిత్రాలకు పెద్దాడ మూర్తి రాసిన పాటలు విశేష ఆదరణ పొందాయి.అలాగే ధారావాహికల కోసం కూడా ఆయన కొన్ని పాటలు రాశారు. చివరిగా ఆయన 'నాగలి' అనే సినిమాకి మాటలు, పాటల రచయితగా పని చేశారు. ఆ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. పెద్దాడమూర్తి ఆకస్మిక మృతిపట్ల పలువురు పాత్రికేయ మిత్రులు, సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని ఈఎస్ఐ శ్మశానవాటికలో పెద్దాడమూర్తి అంత్యక్రియల్ని నిర్వహింనున్నారు.