Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంక్రాంతి బరిలో అమీతుమీ తేల్చుకునేందుకు అగ్ర హీరోల సినిమాలు సమాయత్తమవుతున్నాయి.
సంక్రాంతి పండగ అంటే సినీ వర్గాలకు కలెక్షన్ల పండగ. ఈ సంక్రాంతికి రికార్డ్ స్థాయిలో కలెక్షన్లని రాబట్టుకోవడం కోసం దర్శక, నిర్మాతలు తమ సినిమాలకు పక్కా రిలీజ్ డేట్స్‌ని ఫిక్స్ చేశారు. ఇందులో భాగంగా తొలుత కోలీవుడ్ స్టార్ హీరోలు విజయ్, అజిత్ సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందు పోటీపడుతున్నాయి. విజయ్ 'వారసుడు' (వారిసు - తమిళం), అజిత్ 'తెగింపు', (తునీవు - తమిళం) ఈనెల 11న ఒకేరోజు విడుదల అవుతున్నాయి. ఇక ఈనెల 12న బాలకృష్ణ 'వీరసింహారెడ్డి', 13న చిరంజీవి, రవితేజల 'వాల్తేరు వీరయ్య' చిత్రాలు ఒక్కరోజు గ్యాప్‌తో విడుదలవుతూ సంక్రాంతి సందడిని రెట్టింపు చేయబోతున్నాయి. ఇదిలా ఉంటే, ఈనెల 14న యువ కథానాయకుడు సంతోష్ శోభన్ హీరోగా నటించిన 'కళ్యాణం కమనీయం' సినిమా సైతం సంక్రాంతి పోటీలో అదృష్టం పరీక్షించుకోబోతోంది. ఈ సంక్రాంతికి తగ్గేదేలే.. అంటూ బరితోకి దిగుతున్న హీరోలందరూ తమ సినిమాలదే విజయమనే దీమాతో ఉన్నారు.
- విజయ్, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం 'వారసుడు'. ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి నిర్మించారు. వంశీ పైడిపల్లి దర్శకుడు. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకి తమన్ సంగీతం అందించారు.
- అజిత్, హెచ్.వినోద్ కాంబినేషన్లో బోనీకపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మంజువారియర్, సముద్రఖని, అజయ్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం బ్యాంక్ రాబరీ నేపథ్యంలో సాగుతుంది. జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం సైతం తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలవుతోంది.
- ఈ రెండు సినిమాలు అటు తమిళంలోనే కాకుండా ఇటు తెలుగులోనూ ఇతర సినిమాలకు పోటీగా దిగుతున్నాయి. మొత్తంగా అటు థియేటర్ల పరంగా, ఇటు కలెక్షన్ల పరంగా టాలీవుడ్, కోలీవుడ్‌లో గట్టి సవాల్ విసరబోతున్నాయి.
- బాలకృష్ణ, శృతిహాసన్ జంటగా తెరకెక్కిన చిత్రం 'వీరసింహారెడ్డి'. మలినేని గోపీచంద్ దర్శకత్వంలో పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూర్చారు.
- చిరంజీవి, శృతిహాసన్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఇందులో రవితేజ ఓ కీలక పాత్రలో అలరించబోతున్నారు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. సై అంటూ.. బరిలోకి దిగుతున్న ఈ రెండు చిత్రాలను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించడం ఓ విశేషమైతే, ఈ రెండింటిలోనూ శృతిహాసనే నాయిక కావడం మరో విశేషం.
- యువకథానాయకుడు సంతోష్‌శోభన్, ప్రియ భవానీ శంకర్ హీరో, హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'కళ్యాణం కమనీయం'. నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ళ దర్శకత్వంలో యూవీ కాన్సెప్ట్ సంస్థ నిరుద్యోగి భర్త పడే కష్టాల కథతో ఈ చిత్రాన్ని నిర్మించింది.
- సంక్రాంతి పోటీలో ఎలాంటి సినిమాలు విడుదలైనప్పటికీ కటౌట్ కాదు కంటెంట్ ఉంటేనే ప్రేక్షకులతోపాటు అభిమానులూ విశేషంగా ఆదరిస్తారనే విషయం వేరే చెప్పక్కర్లేదు.