Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ కథానాయకుడు సంతోష్ శోభన్ నటించిన కొత్త సినిమా 'కళ్యాణం కమనీయం'. ప్రియ భవానీ శంకర్ నాయిక. యూవీ కాన్సెప్ట్స్ నిర్మాణంలో దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందించారు. సంక్రాంతి పండగ కానుకగా ఈ నెల 14న ఈ సినిమా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో హీరో సంతోష్‌శోభన్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, 'సంక్రాంతికి సినిమా రిలీజ్ చేసుకోవాలనేది నా కల. అది ఈ చిత్రంతో తీరుతోంది. దర్శకుడు అనిల్ కుమార్ చెప్పిన కథ బాగా నచ్చింది. ఇది మనందరికీ రిలేట్ అయ్యే కథ. ఇలాంటి కథలు అరుదుగా వస్తుంటాయి. నేను ఇప్పటిదాకా చేసిన సోషల్ కామెడీ మూవీస్‌లో నా పాత్రలు రియాల్టీకి కొంత దూరంగా ఉంటాయి. కానీ ఈ చిత్రంలో నేను చేసిన శివ క్యారెక్టర్ చాలా జెన్యూన్‌గా ఉంటుంది. ఇందులో శతి జాబ్ చేస్తుంది, శివకు ఉద్యోగం ఉండదు. అయితే ఇదొక్కటే కథలో కీలకం కాదు. ఈ కొత్త జంట తమ వైవాహిక జీవితంలో ఎదురైన పరిస్థితులను తట్టుకుని ఎలా ముందుకు సాగారు అనేది చూపిస్తున్నాం. ఈ సినిమా ఒక ఎక్స్‌పీరియన్స్‌లా ఉంటుంది. కథ కూడా పాటలతో ముందుకు వెళ్తుంది. శ్రావణ్ భరద్వాజ్ మంచి సంగీతాన్ని అందించాడు. అలాగే కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ ఆకర్షణ అవుతుంది. యూవీ క్రియేషన్స్ సంస్థ నా ఫ్యామిలీ ప్రొడక్షన్ లాంటిది. ఇందులో మూడు చిత్రాలు చేశాను. ప్రస్తుతం నందినీ రెడ్డి దర్శకత్వంలో 'అన్ని మంచి శకునములే'తోపాటు మరో యాక్షన్ ఎంటర్టైనర్ కూడా చేస్తున్నాను' అని తెలిపారు.