Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంతర్జాతీయ స్థాయిలో 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకుంటూ ఆస్కార్ అవార్డులకు ఒక్క అడుగు దూరంలో ఉంది. ఇందులో భాగంగా ఈ సినిమా 'గోల్డెన్ గ్లోబ్' వంటి మరో విశిష్ట పురస్కారాన్ని తన ఖాతాలో వేసుకుని అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది.
ఒరిజినల్ సాంగ్ విభాగానికిగానూ 'ఆర్ఆర్ఆర్' నుంచి 'నాటు నాటు' పాటకు ఈ పురస్కారం వరించింది. బుధవారం కాలిఫోర్నియాలోని ది బెవర్లీ హిల్టన్ వేదికగా జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో దర్శకుడు రాజమౌళి, రామ్‌చరణ్, ఎన్టీఆర్, కీరవాణి కుటుంబ సమేతంగా పాల్గొని సందడి చేశారు.
'నాటు నాటు'కు పురస్కారం ప్రకటించిన తరుణంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్, రాజమౌళి చప్పట్లు కొడుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా అవార్డు తీసుకున్న కీరవాణి మాట్లాడుతూ, 'గోల్డెన్ గ్లోబ్ని అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సంతోష సమయాన్ని నా సతీమణితో పంచుకోవడం మరింత ఆనందంగా ఉంది. నా సోదరుడు రాజమౌళికి ఈ అవార్డు దక్కాలి. పాటలో భాగస్వామ్యమైన రాహుల్ సిప్లిగంజ్‌కి ధన్యవాదాలు. నా శ్రమను, నాకు మద్దతు ఇచ్చిన వారిని నమ్ముకున్నాను. ఈ పాట విషయంలో నా తనయుడు కాలభైరవ అద్భుత సహకారం అందించాడు' అని తెలిపారు.
'నాటు నాటు' పాటకు చంద్రబోస్ సాహిత్యాన్ని అందించగా, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు.