Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఆర్ఆర్ఆర్' సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో మరోసారి సత్తా చాటిన తెలుగు సినిమా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్‌కి ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉంది. దీంతో దేశవ్యాప్తంగానే కాదు యావత్ ప్రపంచం దృష్టి మొత్తం ఇప్పుడు తెలుగు సినిమాపై కేంద్రీకృతమైంది.
ఈ నేపథ్యంలో సంక్రాంతికి విడుదలైన సినిమాలపై అందరిలోనూ మరింత ఆసక్తితో పాటు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు గతంలో మాదిరిగానే అగ్ర హీరోల సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగి మరింత హీట్ పెంచితే, ఈ హీట్‌ని రెట్టింపు చేస్తూ తమిళ అగ్ర హీరోల సినిమాలు సైతం పోటీకి సై.. అంటూ దిగాయి.
పండగ సందర్భంగా రోజుకి ఆరు షోలు వేయడంతో ఈ సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు, ఆయా హీరోల అభిమానులు తెల్లవారుజాము నుంచే క్యూలు కట్టారు. కరోనా గడ్డుకాలం తర్వాత థియేటర్లు ప్రేక్షకులతో కిక్కిరిసిపోవడం శుభ పరిణాయం. అయితే భారీ అంచనాల నేపథ్యంలో సంక్రాంతి బరిలోకి దిగిన చిరంజీవి 'వాల్తేరు వీరయ్య', బాలకృష్ణ 'వీరసింహారెడ్డి', విజయ్ 'వారసుడు', అజిత్ 'తెగింపు'తోపాటు సంతోష్‌శోభన్ నటించిన 'కళ్యాణం కమనీయం' సినిమాలు ప్రేక్షకులను, ఆయా హీరోల ఫ్యాన్స్‌ని అలరించాయో లేదో ఓ లుక్కేద్దాం..
తెగింపు
ఈ ఏడాది సంక్రాంతి బరిలోకి ముందుగా అజిత్ నటించిన 'తెగింపు' (ఈనెల 11) సినిమా విడుదలైంది. బ్యాంక్ మోసాలు, ఆ ట్రాపులో పడి కష్టార్జితాన్ని పోగొట్టుకుని ఏడ్చే మధ్య తరగతి వాళ్ళ జీవితాలు.. ఈ పాయింట్ ఆధారంగా దర్శకుడు హెచ్.వినోద్ సినిమాని అలరించే విధంగా తెరకెక్కించడంలో విఫలమయ్యారు. నటన పరంగా అజిత్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసినప్పటికీ కథ,కథనాలు అంతగా ఆకట్టుకోకపోవడం, గిబ్రాన్ అందించిన నేపథ్య సంగీతం బాబోరు అనిపించేలా ఉండటంతో ఈ సినిమా చూడటం కూడా 'తెగింపు' కింద లెక్కే అన్న చందంగా ప్రేక్షకులు థియేటర్ల నుంచి బయటికి వచ్చారు. ఇందులో మంచి బిల్డప్పులతో బోల్డెన్ని ఫ్యాన్ మూమెంట్స్ ఉన్నప్పటికీ పసలేని కథ వల్ల అజిత్ ఫ్యాన్స్ ఉత్సాహం సైతం నీరుగారిపోయింది.
వీరసింహారెడ్డి
ఈ సినిమా తర్వాత బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' (ఈనెల 12)గా బరిలోకి దిగారు. రాయలసీమ నేపథ్యంలో సిస్టర్ సెంటిమెంట్‌తో కథ, కథనాన్ని అల్లుకున్న దర్శకుడు మలినేని గోపీచంద్ కంటెంట్ కంటే కటౌట్నే బాగా నమ్ముకున్నారు. దీంతో బలహీనమైన కంటెంట్‌కి అదిరిపోయే ఫ్యాన్ మూమెంట్స్‌ని జత చేసి మెప్పించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో మితిమీరిన హింసకి, బూతులకు పెద్ద పీట వేశారు. ఈ సినిమా చూస్తున్న క్రమంలో అసలు సెన్సార్ వాళ్ళు ఎందుకు వీటికి కట్స్ ఇవ్వలేదనే ప్రశ్న ప్రతి ఒక్కరికీ కలుగకమానదు. వీటికితోడు సన్నివేశానికి సంబంధంలేని డైలాగుల్ని జొప్పించడం, అవసరం ఉన్నా లేకపోయినా తమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సైతం అందరికీ చిరాకు తెప్పించింది. ఇక ఈ సినిమా చూస్తున్నంత సేపు 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు', 'సింహా', 'లెజెండ్', 'అఖండ' సినిమాలన్ని ఒకేసారి గుర్తుకొస్తాయి. అయితే కథ ఎలా ఉన్నప్పటికీ బాలయ్య గెటప్, ఆయన డైలాగ్స్ చెప్పిన విధానం, బిల్డప్ షాట్స్‌కు అభిమానులు ఫిదా అయిపోతారంతే.
వాల్తేరు వీరయ్య
'వీరసింహారెడ్డి'గా బాలయ్య సిస్టర్ సెంటిమెంట్‌తో పోటీలోకి దిగితే, 'వాల్తేరు వీరయ్య' (ఈనెల13)గా చిరంజీవి బ్రదర్ సెంటిమెంట్‌తో రంగంలోకి అడుగుపెట్టారు. వాల్తేరు వీరయ్యగా చిరంజీవి, ఆయన తమ్ముడిగా రవితేజ తమ తమ పాత్రలతో మెప్పించినప్పటికీ రొటీన్ కథ నీరసాన్ని తెప్పించింది. చిరంజీవిని చూస్తున్నంత సేపూ 'ముఠామేస్త్రీ', 'ఘరానా మొగుడు', 'గ్యాంగ్‌లీడర్' వంటి తదితర సినిమాలు ఒక్కొక్కటిగా మన మదిలో మెదులుతాయి. ఇద్దరు స్టార్లని పెట్టుకుని దర్శకుడు బాబీ వీక్ లైన్‌తో సన్నివేశాలను అల్లుకోవడం బాధాకరం. అక్కడక్కడ కొన్ని మెరుపులు ఉన్నప్పటికీ వీక్ సీన్స్ వల్ల అవి కూడా తేలిపోయాయి. అయితే ఫ్యాన్ మూమెంట్స్ మాత్రం అటు చిరంజీవి, ఇటు రవితేజ అభిమానుల్ని బ్రహ్మాండంగా అలరించాయి.
వారసుడు
ఇక ఈనెల 14న విజయ్ 'వారసుడు'గా సంక్రాంతి పోటీలో అమీతుమీ తేల్చుకునేందుకు దిగాయ్. గాడి తప్పిన అన్నలను దారిలోకి తీసుకొచ్చే తమ్ముడి కథగా రూపొందిన ఈ సినిమా సైతం రొటీన్ పాయింట్‌తో అలరించలేక పోయింది. ఈ పాయింట్‌తో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ దర్శకుడు వంశీ పైడిపల్లి కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తాడనే నమ్మకంతో చూసిన ప్రేక్షకులందర్నీ నిరాశపర్చాడు. ఇందులోనూ ఫ్యాన్ మూమెంట్స్‌కి కొదవలేదు. తమ హీరోకి సంబంధించిన బిల్డప్ షాట్స్ వచ్చినప్పుడు అభిమానుల హంగామా అంతా ఇంతా కాదు.
కళ్యాణం కమనీయం
పెద్ద సినిమాలకు దీటుగా సంతోష్ శోభన్ నటించిన 'కళ్యాణం కమనీయం' (ఈనెల14)న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుత ట్రెండ్‌లో ఉద్యోగం లేని భర్తకి ఉండే కష్టాల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. నూతన దర్శకుడు అనిల్‌కుమార్ సైతం వీక్ పాయింట్‌తో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసి విఫలమయ్యారు.
'వీరసింహారెడ్డి', 'వాల్తేరు వీరయ్య' చిత్రాల్లో కథానాయికగా నటించిన శృతిహాసన్, 'వారసుడు'లో నాయికగా నటించిన రష్మిక మందన్నా కేవలం పాటలకే పరిమితమయ్యారు.
'వీరసింహారెడ్డి', 'వాల్తేరు వీరయ్య' ఈరెండు చిత్రాల్లో సిస్టర్, బ్రదర్ సెంటిమెంట్ ఉన్నప్పటికీ ఈ రెండూ కూడా సవతి తల్లి నేపథ్యంతోనే ఉన్నాయి. ఇక విజువల్ ట్రీట్ పరంగా 'వీరసింహారెడ్డి', 'వాల్తేరు వీరయ్య', 'వారసుడు', 'తెగింపు'.. ఏ సినిమాకి ఆ సినిమా తగ్గేదేలా అన్నట్టు ఉన్నాయి. సినిమాలను ఆమాత్రం ప్రేక్షకులు చూడటానికి కారణం రిచ్‌గా ఉన్న సినిమాటోగ్రఫీని కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే ఆయా నిర్మాణ సంస్థలు సైతం మేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని కూడా స్పష్టమవుతోంది. బిల్డప్పుల పరంగా 'వీరసింహారెడ్డి', 'వాల్తేరు వీరయ్య', 'వారసుడు', 'తెగింపు' ఈ చిత్రాలన్ని ఆయా హీరోల ఫ్యాన్స్‌కి మాత్రం డబుల్ ధమాకా ఇచ్చాయి.
కటౌట్ కాదు.. కంటెంటే కింగ్
ఆన్ హోల్.. భారీ బడ్జెట్‌తో, భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాలు సంక్రాంతి సందర్భంగా వచ్చిన సెలవులు కారణంగా, అభిమానుల సందడి కారణంగా భారీ కలెక్షన్లను రాబట్టుకోవచ్చేమోగాని కథ పరంగా మాత్రం అందర్నీ నిస్సందేహంగా నిరుత్సాహాపరిచాయి. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా రెపరెప లాడుతున్న తరుణంలో ఇప్పటికీ రొటీన్ రొడ్డకొట్టుడు కథలతో కొత్త సీసాలో పాత సారా అన్న చందంగా మెప్పించే ప్రయత్నం చేస్తే ఫలితం కూడా అలాగే ఉంటుందని, కటౌట్ కంటే కంటేంటే కింగ్ అని మేకర్స్ తెలుసుకోవాలి.
- రెడ్డి హనుమంతరావు