Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిర్మాత సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ కోలీవుడ్ అగ్ర నటుడు ధనుష్‌తో జతకడుతూ 'సార్' చిత్రాన్ని శ్రీమతి సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ)తో కలిసి నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ చిత్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రానికి సమర్పకునిగా వ్యవహరిస్తోంది. ఇందులో ధనుష్‌తో సంయుక్త మీనన్ జోడీ కడుతున్నారు.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు, తమిళంలో నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రం 'సార్'(తెలుగు) 'వాతి' (తమిళం) నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన 'బంజారా' అనే పాటను మేకర్స్ మంగళవారం విడుదల చేశారు. 'ఆడ ఉంది నీవే ఈడ ఉంది నీవే, నీది కానీ చోటే లేనేలేదు బంజారా..' అంటూ సుద్దాల అశోక్‌తేజ అందించిన అద్భుతమైన సాహిత్యానికి అంతే అద్భుతమైన జివి ప్రకాష్ సంగీతం, అనురాగ్ కులకర్ణి స్వరం తోడై పాటను మరో స్థాయికి తీసుకెళ్లాయి. అలాగే సంగీతానికి తగ్గట్లుగా నృత్య దర్శకుడు విజరు బిన్ని అందించిన స్టెప్పులు అందర్నీ అలరిస్తున్నాయి.
'జీవితం వెనుక ఉన్న వేదాంతాన్ని, జనన మరణాల మధ్య ఉన్న బతుకు బాట, దాని పరమార్థాన్ని చిత్ర కథానుసారం చెప్పే ప్రయత్నం చేశాం. భగవంతుడు మనకు ఏమీ చేయట్లేదని అనుకోవద్దు. నీకోసం ఒక స్థానం పెట్టాడు. అక్కడికి చేరుకోవటం నీ భాధ్యత అని చెప్పే పాట ఇది. బతుకు ప్రయాణం గురించి పాట కావాలని, చిత్ర కథ, సందర్భం దర్శకుడు చెప్పిన తీరు నచ్చింది. ఆది శంకర తత్వాన్ని, భగవద్గీత సారాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ గీతానికి సాహిత్యం అందించటం జరిగింది' అని గీత రచయిత సుద్దాల అశోక్ తేజ తెలిపారు.
విద్యావ్యవస్థ తీరుపై కథానాయకుడు చేసే పోరాటం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.