Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా 'హంట్'. మహేష్ దర్శకత్వం వహించారు. ఇందులో తమిళ హీరో భరత్ ప్రధాన పాత్రలో నటించారు. ఇది ఆయన నటించిన తొలిసారి స్ట్రెయిట్ తెలుగు సినిమా కావడం విశేషం. రిపబ్లిక్ డే కానుకగా ఈనెల 26న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా భరత్ మీడియాతో సంభాషించారు.
'బార్సు, ప్రేమిస్తే, యువసేన చిత్రాలతో తెలుగులోనూ నేను ఫేమస్ అయ్యాను. తమిళ సినిమాలు వరుసగా చేయటంతో తెలుగులో బాగా గ్యాప్ వచ్చింది. దర్శకుడు మహేష్ చెప్పిన కథ నచ్చి, దాదాపు 12 ఏళ్ళ తర్వాత తెలుగులో ఈ మూవీ చేశా. పైగా... సుధీర్ బాబు నాకు మంచి ఫ్రెండ్. సీసీఎల్‌లో ఇద్దరం కలిసి క్రికెట్ మ్యాచులు ఆడాం. శ్రీకాంత్ కూడా సీసీఎల్ వల్ల కాస్త క్లోజ్. సో.. అన్నీ కుదిరి ఈ సినిమా ఓకే చేశా. ఈ కథ మా ముగ్గురి (భరత్, శ్రీకాంత్, సుధీర్ బాబు) చుట్టూ తిరుగుతుంది. ఇందులో ఆర్యన్ దేవ్ అనే ఐపీఎస్ ఆఫీసర్‌గా నటించా. ఇందులో యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషన్, ఫ్రెండ్ షిప్ అన్నీ ఉంటాయి. ఈ సినిమా తెలుగులోనూ నా మార్కెట్‌కి హెల్ప్ అవుతుందన్న నమ్మకం ఉంది. తమిళ్ మూవీ 'కాళిదాసు'లో నా లుక్ చూసి డైరెక్టర్ మహేష్ ఈ మూవీలోనూ అలానే ఉండాలనుకున్నారు. ఆ సినిమా హిట్ కాబట్టి సెంటిమెంట్ కూడా వర్కవుట్ అవుతుందని అదే లుక్‌తో నటించా (నవ్వుతూ). ఈ కథ ప్రధానంగా హైదరాబాద్‌లోనే నడుస్తుంది. కొన్ని యాక్షన్ పార్ట్స్ పారిస్‌లో కూడా షూట్ చేశాం. కథకు సూటయ్యేలా, స్క్రీన్ ప్లేకు కనెక్టయ్యేలా యాక్షన్ సీన్స్ బాగా డిజైన్ చేశారు. సినిమా కోసం ఖర్చుకు వెనుకాడకుండా భవ్య క్రియేషన్ ఆనంద్ ప్రసాద్‌గారు చాలా లావిష్, రిచ్‌గా తీశారు. యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ఫారిన్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్‌ను తీసుకు వచ్చారు. ప్రేక్షకులకు మంచి సినిమా అందించాలని ఆలోచించే నిర్మాత ఆయన. ఈ ప్రాజెక్టుపై టీమ్ అంతా పాజిటివ్‌గా ఉన్నాం. రిలీజయ్యాక ఆడియెన్స్ ఆదరిస్తే, నిర్మాతలూ ఓకే అనుకుంటే, సీక్వెల్ ఉంటుందేమో చూడాలి' అని భరత్ చెప్పారు.