Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్ పతాకంపై నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా 'హంట్'. మహేష్ దర్శకత్వం వహించారు. ఇందులో శ్రీకాంత్, తమిళ హీరో భరత్ ప్రధాన పాత్రల్లో నటించారు. రిపబ్లిక్ డే కానుకగా ఈనెల 26న థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు మహేష్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
హీరోకి మెమరీ లాస్ అనేది కొన్ని సినిమాల్లో చూశారు. గతం మర్చిపోవడానికి ముందు, వెనుక ఏం జరిగింది? అనేది డ్రామా. మా 'హంట్' సినిమాలో ఆ డ్రామా కంప్లీట్ డిఫరెంట్, కొత్తగా ఉంటుంది. 'హంట్'ను ఓ లైనులో చెప్పాలంటే ఓ యాక్సిడెంట్లో గతం మర్చిపోయిన పోలీస్ ఆఫీసర్... తనను తాను తెలుసుకుంటూ, జీవితంలో జరిగిన ఓ బ్యాడ్ ఇన్సిడెంట్ తాలూకూ మిస్టరీని ఎలా చేధించాడు? అనేది సినిమా. అన్నీ గుర్తుండి సాల్వ్ చేయడం ఒక పద్ధతి. ఏమీ తెలియనివాడు ఎలా సాల్వ్ చేశాడనేది మిస్టరీ.
ఈ కథలో హీరోయిన్ లేరు, అదొక రిస్క్ ఎలిమెంట్. కమర్షియల్ సినిమాలు చేసే హీరోలు కొన్ని కొన్ని ఆలోచిస్తారు. సుధీర్‌బాబు అటువంటివి అన్నీ పక్కన పెట్టి నాకు ఎంతో సపోర్ట్ చేశారు. సినిమాలో ఒక్కటే పాట ఉంది. ఉన్న ఒక్క పాట కూడా న్యూ ఇయర్ పార్టీ సాంగ్ తరహాలో ఉంటుంది.
ఈ సినిమాలో భరత్‌ది చాలా ఇంపార్టెంట్ రోల్. సుధీర్ బాబు, భరత్ కాంబినేషన్ కొత్తగా ఉంటుందని అనిపించింది. అలాగే ఈ సినిమాలో సుధీర్ బాబుకు ఒక మార్గదర్శి లాంటి రోల్ ఉంది. హీరోకి సలహాలు ఇస్తూ... మోరల్ సపోర్ట్ ఇచ్చే క్యారెక్టర్ ఉంటుంది. ఆ పాత్ర ఎవరు చేస్తే బావుంటుంది? అనిపించినప్పుడు... శ్రీకాంత్ గుర్తొచ్చారు.
కథ డిమాండ్ మేరకు ఇందులో ఆరు ఫైట్స్ ఉన్నాయి. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ఫారిన్ స్టంట్ కొరియోగ్రాఫర్స్‌ను తీసుకొచ్చారు. పారిస్‌లో షూటింగ్ చేశాం. అందులో రెండు ఛేజింగ్ సీక్వెన్సులు. టీజర్, ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఫైట్స్ బావున్నాయని చెబుతున్నారు. సినిమా విడుదల తర్వాత థియేటర్లలో ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.
యాక్షన్ సినిమాలకు రీ రికార్డింగ్ చాలా ఇంపార్టెంట్. నాకు ఎప్పుడూ జిబ్రాన్‌తో పని చేయాలని ఉండేది. 'రన్ రాజా రన్', 'జిల్' నుంచి ఆయన సౌండింగ్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఆయన కూడా కథ విని ఓకే చేశారు. ముందు నుంచి ఈ సినిమాకు నా ఫస్ట్ ఛాయిస్ జిబ్రానే.
దర్శకుడిగా నా తొలి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్. అయినా సరే ఇంత భారీ తారాగణం, నిర్మాణ వ్యయంతో సినిమా తీశానంటే నిర్మాత ఆనంద ప్రసాద్, రవి గారే కారణం. వాళ్ళ వల్లే ఈ రోజు నేను ఇలా నిలబడగలిగా.