Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్య్ర సమర యోధుల జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని ఇప్పటి వరకు తెలుగు సినీ చరిత్రలో ఎవరూ చేయనటువంటి గొప్ప దేశభక్తి చిత్రం 'దేశం కోసం భగత్ సింగ్'.
గతంలో 'అన్నల రాజ్యం, నాగమనాయుడు, రాఘవేంద్ర మహత్యం' లాంటి చిత్రాలను నిర్మించిన నాగలక్ష్మి ప్రొడక్షన్స్ అధినేత రవీంద్ర గోపాల ఈ చిత్రాన్ని నిర్మించారు. రవీంద్రజి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ.. ఈ చిత్రాన్ని తెరకెక్కిం చారు. రవీంద్ర గోపాల, రాఘవ, మనోహర్ ప్రధాన పాత్రలలో నటించగా సూర్య, జీవా, ప్రసాద్ బాబు, అశోక్ కుమార్, సుధ నటించారు. ఈ చిత్రంలోని పాటలను ఇటీవల ఫిలించాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రచయిత పరుచూరి గోపాలకష్ణ, నిర్మాత దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్, మోహన్ వడ్లపట్ల, బాబ్జీ, ప్రమోద్ శర్మ, బల్లెపల్లి మోహన్, ఘంటాడి కష్ణ, దర్శకుడు, నటుడు, నిర్మాత రవీంద్ర గోపాల తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పరుచూరి గోపాలకష్ణ మాట్లాడుతూ, ''అల్లూరి సీతారామ రాజు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ ఇలా స్వాతంత్య్ర సమరయోధుల పాత్రలంటే ఎన్టీఆర్‌గారే గుర్తొస్తారు. అలాంటి సాహసం చేసి మన రవీంద్ర గోపాల్ ఈ సినిమాలో ఏకంగా 14 మంది స్వాతంత్య్ర సమర యోధుల పాత్రలు వేశాడు. తన మీద తనకు ఎంతో నమ్మకం ఉంటే కానీ ఇది సాధ్యం కాదు. తనకోసం కాదు.. ఇది దేశంకోసం చేసిన సినిమా. స్వాతంత్య్ర సమర యోధుల గొప్పతనాన్ని ప్రపంచానికి తెలపాలన్న తపనతో ఈ సినిమా చేశాడు. ఇటీవల సినిమా చూశాను. ప్రతి పాత్రకు న్యాయం చేశాడు. ఇందులో పాటలు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా విజయం సాధించి, మరెన్నో మంచి చిత్రాలు చేసే ప్రోత్సాహాన్ని ప్రేక్షకులు కల్పించాలని కోరుకుంటున్నా' అని అన్నారు.
'ఒక మంచి సినిమా చేయాలన్న కసితో చేసిన సినిమా ఇది. ఇటీవల మా చిత్ర ట్రైలర్‌ని ఆవిష్కరించి, మమ్మల్ని ఆశీర్వదించిన నిర్మాత దిల్ రాజుకి ధన్యవాదాలు. సినిమాను ఫిబ్రవరి 3న విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నాం' అని చిత్ర దర్శకుడు, నిర్మాత, నటుడు రవీంద్ర గోపాల్ తెలిపారు. సంగీత దర్శకుడు ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ,'ఇందులో 7 పాటలున్నాయి. ప్రతి పాటను నాతో అద్భుతంగా చేయించిన రవీంద్రకి ధన్యవాదాలు' అని చెప్పారు.