Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సినీ పరిశ్రమలో మగవారిని కాదని ఏమీ చేయలేమని, వారు చెప్పినట్లు చేస్తేనే మంచిదని, ఇండిస్టీలో గౌరవాన్ని కోల్పోకుండా ఏ స్టార్ కూడా ఉండలేరు అని ఓ సీనియర్ నటి అన్నప్పుడు ఎలా ఉండలేమో నేనూ చూస్తాను అని చెప్పాను. అదే విధంగా ఇప్పటివరకూ ఉన్నాను. ఈ విషయంలో నాకు భానుమతిగారు స్ఫూర్తి.
- జమున
జమున.. ఈ పేరు వినగానే ఠక్కున గుర్తొచ్చేది సత్యభామ పాత్ర.
రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ సత్యభామ పాత్రకి ఆమె ప్రతిబింబం. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు రెండు వందల చిత్రాల్లో నటించి తన ప్రత్యేకతను చాటుకున్న అలనాటి మేటినటి. అగ్ర హీరోలకు దీటుగా రాణిస్తూ,
నటీమణుల స్వర్ణయుగానికి నాంది పలికిన నాయిక.
మూడు దశాబ్దాలుగా ఎన్నో ఐకానిక్ పాత్రలతో ప్రేక్షకుల మదిపై చెరగని ముద్ర వేసిన జమున (86) ఇకలేరనే వార్త ఆమె అభిమానులనే కాదు తెలుగు చిత్ర పరిశ్రమ కూడా జీర్ణించుకోలేకపోతోంది.
కృష్ణ, కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణ, చలపతిరావు వంటి హేమాహేమీలను కోల్పోయి శోకసంద్రంలోంచి తేరుకోలేని చిత్ర పరిశ్రమను జమున మరణం మరింత విషాదంలోకి నెట్టింది.
గత కొంత కాలంగా వయో సంబంధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జమున హైదరాబాద్‌లోని తన నివాసంలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు.
అశేష ప్రేక్షకలోకాన్ని తన అద్భుతమైన నటనతో మైమరపించిన జమున సినీ జీవిత ప్రయాణంలోని కొన్ని విశేషాలు..
1936 ఆగస్ట్ 30న నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేవి దంపతులకు జమున హంపీలో జన్మించారు. సినిమాల్లోకి రాకముందు ఆమెపేరు జానాబాయి. అయితే జ్యోతిషుల సూచనతో ఆమె పేరును జమునగా మార్చారు. తండ్రి వ్యాపార రీత్యా.. ఆమె బాల్యమంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది. తల్లి దగ్గరే సంగీతం, హార్మోనియం నేర్చుకున్నారు. స్కూల్లో చదువుతున్నప్పుడు 'మాభూమి', 'ఢిల్లీ ఛలో' వంటి నాటికల్లో నటించారు. 'విందు' నాటికలో యశోదగా నటించారు. అంతేకాదు ఈనాటికకు దర్శకత్వంతోపాటు సంగీతాన్ని కూడా ఆమే సమకూర్చారు. చిన్నతనంలోనే హంపిసుందరిగా పేరొందారు.
జమునకు నటుడు జగ్గయ్య గురువు. చదువుకునే రోజుల్లోనే జమునలోని నటనా ప్రతిభను గుర్తించిన ఆయన 'ఖిల్జీరాజు పతనం' అనే నాటకంలో ఎంపిక చేశారు. ఈ నాటకాన్ని చూసిన డా|| గరికపాటి రాజారావు జమునకు తన 'పుట్టిల్లు' (1953) చిత్రం ద్వారా కథానాయికగా సినీ రంగ ప్రవేశం కల్పించారు.
'అంతా మనవాళ్లే' సినిమాతో ఆమె కెరీర్ మలుపుతిరిగింది. 'నిరుపేదలు, మా గోపీ, బంగారుపాప' సినిమాలు ఆమెకు మంచిపేరు తీసుకొచ్చాయి. 'మిస్సమ్మ' సినిమాలో ఆమె నటన అందరినీ ఆకట్టుకుంది. రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, జగ్గయ్య వంటి అలనాటి అగ్రహీరోల సరసన నాయికగా నటించినప్పటికీ.. ఆమెకు బాగా పేరు తెచ్చింది మాత్రం సత్యభామ క్యారెక్టరే. ఆ పాత్రలో ఆమెను తప్ప ఇంకెవరినీ ఊహించుకోలేమన్నట్టుగా జీవించారు.
తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 198 సినిమాల్లో ఆమె నటించారు. ఇందులో తెలుగులో 145 సినిమాలు ఉండగా, తమిళం 20, కన్నడం 7, హిందీలో 10 చిత్రాల చొప్పున ఉన్నాయి. 1959 నుంచి సావిత్రితోపాటే స్వర్ణయుగం చూసిన జమునకు తెనాలి రామకృష్ణ, భాగ్యరేఖ, భూకైలాస్, దొంగల్లో దొర, ఇలవేల్పు, ఇల్లరికం, ముద్దుబిడ్డ, చిరంజీవులు, మిస్సమ్మ, మూగమనసులు, శ్రీకృష్ణ తులాభారం, రాముడు-భీముడు, తోడు-నీడ, రాము, లేతమనసులు, పూలరంగడు, ఉండమ్మా బొట్టు పెడతా, గులేబకావళి కథ, బొబ్బిలియుద్ధం, మంచి మనిషి తదితర సినిమాలు మంచి పేరు తీసుకొచ్చాయి.
ఒకానొక సమయంలో జమున స్టార్ స్టేటస్‌తో పాటు ఆమె తాలూకా కొన్ని విషయాలు నచ్చక అగ్ర కథానాయకులు ఎన్టీఆర్, ఏయన్నార్ నాలుగేండ్ల పాటు తమ సినిమాల్లో నటించకుండా చేశారు. తమకి క్షమాపణ చెప్పాలని పట్టుబడితే, సినిమాలైనా మానేస్తానని గట్టిగా సమాధానం చెప్పారు. అంతేకాదు ధైర్యంగా కొత్త హీరోలతో నటించి విజయాలు అందుకున్నారు. వీటిల్లో 'లేత మనసులు', 'పాల మనసులు', 'పెళ్ళి తాంబూలం' వంటి తదితర చిత్రాలు ఏకంగా 100 రోజులు ఆడాయి.
పరిశ్రమలో సావిత్రితో జమునకి ప్రత్యేక అనుబంధం ఉంది. వీళ్ళిద్దరూ సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ అక్కాచెల్లెళ్ళుగా ఉన్నారు. అలాగే నటుడు హరనాథ్‌ని జమున వివాహం చేసుకుంటారనే వార్తలు అప్పట్లో సంచలనం సృష్టించాయి.
చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన తొలితరం నాయిక జమున కావడం విశేషం. ఇక్కడికి వచ్చిన తర్వాత నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆహ్వానంతో 1980లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1985లో మంగళగిరి నుంచి పోటీచేసి ఓడిపోయారు. అనంతరం 1989లో రాజమండ్రి నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలుపొందారు. రాష్ట్ర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు. రాజకీయాల్లో ఇమడలేక ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని విస్తృతంగా సేవలందించారు.
'హలో మేడమ్ సత్యభామ', 'అందాల ఓ చిలకా..', 'నన్ను దోచుకుందువటే..', 'ముత్యాల చెమ్మాచెక్క.', 'నీ మది చల్లగా..', 'గోదారి గట్టుంది..', 'గౌరమ్మ నీ మొగుడు ఎవరమ్మా..', 'మాను మాకుని కాదు..' వంటి తదితర ఎన్నో పాటల్లో జమున హావభావాలతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు.
'మూగ మనసులు' సినిమాకి ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు, 'మిలాన్' చిత్రంలో గౌరీ పాత్రకు బాలీవుడ్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్, 2008లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం జమునను వరించాయి.
అలనాటి తార జమున అంత్యక్రియలు హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ మహాప్రస్థానంలో శుక్రవారం ముగిశాయి. జమున కూతురు స్రవంతి
అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తమ అభిమాన నటి జమునకు
తుది వీడ్కోలు పలికేందుకు అభిమానులు, సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో మహాప్రస్థానానికి తరలివచ్చారు. అంతకుముందు ఆమె భౌతికకాయాన్ని
ఆమె నివాసం నుంచి అభిమానులు, ప్రజల సందర్శనార్థం ఫిలింఛాంబర్‌కు తరలించారు. అక్కడ సినీ ప్రముఖులు, అభిమానులు జమున పార్థీవ దేహానికి నివాళులర్పించారు. తెలుగింటి సత్యభామగా కోట్లాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న జమునతో తమకి అనుబంధాన్ని గుర్తు చేసుకుని పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. కొంత కాలం క్రితం జమున భర్త డా||రమణారావు మరణించారు. ఆమెకు కొడుకు వంశీ, కూతురు స్రవంతి ఉన్నారు.
ఆత్మాభిమానానికి ప్రతీక
వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఆత్మాభిమానానికి ప్రతీకగా నిలిచిన జమున మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె సాధించిన విజయాలను, సృష్టించిన చరిత్రను గుర్తుచేసుకుంటూ తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
వెండితెర సత్యభామగా పేరుగాంచిన జమున పోషించిన పాత్రలు ఆత్మవిశ్వాసానికి, మహిళా సాధికారతకు ప్రతీకలు. ఆవిడ బహుభాషా నటి.
- చిరంజీవి
అల్లరి పిల్లగా, ఉక్రోషంతో ఊగిపోయే మరదలిగా, ఉత్తమ ఇల్లాలిగా, అన్నింటికీ మించి తెలుగువారి సత్యభామగా మనల్ని ఎంతో మెప్పించారు జమున గారు. ఆ రోజుల్లోనే పలు హిందీ సినిమాల్లోనూ నటించి ఔరా అనిపించి అందరి ప్రసంశలు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి.
- బాలకృష్ణ
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అలనాటి తరానికి ప్రతినిధిగా ఉన్నారు. ఠీవీగాను, గడుసుగాను కనిపించే పాత్రల్లోనే కాకుండా అమాయకత్వం ఉట్టిపడే పాత్రల్లోనూ ప్రేక్షకుల మెప్పు పొందారు. ప్రజా జీవితంలో లోక్‌సభ సభ్యురాలిగా సేవలందించారు.
- పవన్ కల్యాణ్
ఆమె చేసినవి అన్ని ఐకానిక్ పాత్రలు. పరిశ్రమకు ఆమె చేసిన సేవని తెలుగువారు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు.
- మహేష్ బాబు
దాదాపుగా 30 సంవత్సరాలు తెలుగు సినిమా ఇండిస్టీలో మహారాణిలా కొనసాగారు. 'గుండమ్మ కథ, మిస్సమ్మ'లాంటి ఎన్నో మరుపురాని చిత్రాలు, మరెన్నో వైవిధ్యమైన పాత్రలతో మా మనసుల్లో చెరపలేని ముద్ర వేశారు.
- ఎన్టీఆర్
లెజెండరీ నటి జమున మృతి చెందడం బాధాకరం. కెరీర్లో ఆమె చేసిన ఐకానిక్ పాత్రలు, తెలుగు సినీ పరిశ్రమకు చేసిన సేవలకుగాను ఆమెను సినీ ప్రేక్షకాభిమానులు ఎప్పటికీ ప్రేమగా గుర్తుంచుకుంటారు.
- కె.రాఘవేంద్రరావు