Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మన సంస్కృతి, సంప్రదాయాల్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లి మనందరినీ గర్వపడేలా చేసిన దిగ్దర్శకుడు కె.విశ్వనాథ్' అని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు.
ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ జయంతిని పురస్కరించుకుని 'కళాతపస్వికి కళాంజలి' పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిరంజీవి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తిగా నా మనసులో స్థానం ఎప్పటికీ పదిలం. ఈ వేదిక విశ్వనాథ్‌గారి సంతాప స్థలంలా ఉండకూడదు. ఓ సంబరంలా ఉండాలి. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకోవాలి అని మేమంతా అనకున్నాం. దర్శకులు కాశీ విశ్వనాథ్, వీఎన్ ఆదిత్య, ఏడిద రాజా, పీపుల్ మీడియా సంస్థ, టి.సుబ్బిరామిరెడ్డి తదితరుల సహకారంతో ఇది సాధ్యమైంది. ఈ విధంగా విశ్వనాథ్‌గారి ఆత్మ శాంతిస్తుందని విశ్వసిస్తున్నా. ఆయన్ని నేను మూడు కోణాల్లో చూస్తుంటా. నాకు మూడు సినిమాల్లో అవకాశం ఇచ్చిన దర్శకుడిగా, అనుక్షణం నా నటనను సరిదిద్దిన గురువుగా, ఆయన చూపించిన ప్రేమ విషయంలో తండ్రిగా భావిస్తుంటా. నటుడిగా నిలదొక్కుకుంటున్న సమయంలో 'శుభలేఖ సినిమా చేసే అవకాశం ఇచ్చారు. వైజాగ్‌లో మొదటిరోజు షూటింగ్లో ఉండగా నా దగ్గరకు వచ్చి 'నిన్ను ఎవరైనా తరుముతున్నారా?, అంత వేగంగా డైలాగ్ చెబుతున్నావు' అని అన్నారు. కంగారుగా ఉంది సర్ అని చెప్పడంతో నా స్పీడ్‌ను నియంత్రించి, సరిగ్గా చెప్పేలా చేశారు. ఓసారి బెత్తంలాంటిది పట్టుకుని తిరుగుతుంటే.. ఆ స్టైల్ నచ్చి అలా డ్యాన్స్ చేస్తావా అని అడిగారు. నటుల్లోని ఒరిజినాలిటీని ఆయన చక్కగా రాబట్టుకునేవారు. నేను క్లాసికల్ డ్యాన్స్ చేయగలనని ఆయన చెప్పేంత వరకూ నాకు తెలియదు. నేను పూర్తిస్థాయిలో మాస్ యాక్షన్ చిత్రాలు చేస్తున్నప్పుడు 'స్వయంకృషి' కథ చెప్పారు. ఆయన శిక్షణతో ఆయా పాత్రల్లో ఒదిగిపోయేవాణ్ని. సున్నితంగా నటించడం ఆయన దగ్గరే నేర్చుకున్నా. మా కాంబినేషన్లో వచ్చిన 'ఆపద్భాంధవుడు' మరో అపురూప చిత్రం' అని చెప్పారు. ఈ వేడుకలో కె.రాఘవేంద్రరావు, ఆమని, తనికెళ్ళభరణి, రాధిక, జయసుధ, జీవిత, రాజశేఖర్, అలీ తదితరులు పాల్గొని కె.విశ్వనాథ్‌తో తమకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.