Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరుస మరణాలతో విషాదంలో ఉన్న తెలుగు చిత్ర సీమను ప్రముఖ ఎడిటర్ జి.జి.కృష్ణారావు మృతి రూపంలో మరింత విషాదంలోకి నెట్టింది. 300 పైగా చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసి ఎందరెందరో శిష్యులను తెలుగు చిత్ర పరిశ్రమకు అందించిన జి.జి.కృష్ణారావు (87) మంగళవారం బెంగళూరులోని ఆయన స్వగృహంలో తుది శ్వాస విడిచారు.
ఆదుర్తి సుబ్బారావు, కళాతపస్వి కె. విశ్వనాథ్, దర్శక రత్న డాక్టర్ దాసరి నారాయణరావు, జంధ్యాల వంటి ప్రముఖ దర్శకుల చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసి, మూడుసార్లు ఉత్తమ ఎడిటర్‌గా నంది అవార్డు అందుకున్న కృష్ణారావు మరణం పట్ల తెలుగు ఫిలిం ఎడిటర్స్ అసోసియేషన్ తీవ్ర సంతాపాన్ని ప్రకటించింది.
'నేటితరం ఎడిటర్స్‌లో చాలామంది ప్రముఖులు ఆయన శిష్యులే. ఎడిటింగ్ శాఖకు ఎనలేని గౌరవాన్ని తెచ్చిన ప్రముఖులలో జి.జి. కృష్ణారావు గారు ఒకరు. ఆయన మరణంతో తెలుగు ఫిలిం ఎడిటర్స్ శాఖ ఒక పెద్ద దిక్కును కోల్పోయింది' అంటూ సంతాప తీర్మానంలో తెలిపారు.
'శంకరాభరణం', 'సాగరసంగమం', 'సర్దార్ పాపారాయుడు', 'స్వాతిముత్యం', 'శుభలేఖ', 'బొబ్బిలిపులి', 'సీతామహాలక్ష్మీ', 'శృతిలయలు', 'ముద్దమందారం', 'నాలుగు స్తంభాలాట', 'సిరివెన్నెల', 'శుభసంకల్పం', 'స్వరాభిషేకం', 'శ్రీరామాంజనేయం' వంటి తదితర ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలకు కృష్ణారావు ఎడిటింగ్ ప్రతిభ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.