Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్గానిక్ మామ - హైబ్రిడ్ అల్లుడు'. రాజేంద్ర ప్రసాద్, మీనా ప్రధాన పాత్రల్లో కె. అచ్చిరెడ్డి సమర్పణలో అమ్ము క్రియేషన్స్, కల్పన చిత్ర పతాకంపై శ్రీమతి కోనేరు కల్పన నిర్మిస్తున్న ఈ చిత్రంలో బిగ్‌బాస్ ఫేం సోహెల్, మృణాళిని హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. మార్చిలో విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమాకు సంబంధించి పలు విశేషాలను యూనిట్ మీడియాతో పంచుకుంది.
ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ,'ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు అందరినీ అలరించే చిత్రాలతో విజయవిహారం చేసిన ఎస్.వి.కృష్టారెడ్డి, నేను, అచ్చిరెడ్డి మళ్లీ ఇంతకాలం తర్వాత కల్పన గారి నిర్మాణంలో ఈ చిత్రంతో మరో విజయ విహారానికి సిద్ధం అవుతున్నాం. ఒకప్పుడు ఇంటిల్లిపాదీ చూసే సంస్కారవంతమైన సినిమాలు చేసిన మేము.. ఈ సినిమాను కూడా అంతే సంస్కారవంతంమైన కేటగిరీ సినిమాగా రూపొందించి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. ఇది వంద శాతం ఫ్యామిలీ ఎంటర్టైనర్' అని తెలిపారు.
''వినోదం' తర్వాత నేను చేసిన కంప్లీట్ కామెడీ మూవీ ఇది. నాకు చాలా సంతృప్తినిచ్చిన సినిమా కూడా. వినోదానికి, మంచి డైలాగ్స్‌కి స్కోప్ ఉన్న కథ. మీకు నచ్చే అన్ని అంశాలనూ పుష్కలంగా ఏర్చి కూర్చిన సినిమా ఇది' అని దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. సమర్పకుడు కె. అచ్చిరెడ్డి మాట్లాడుతూ,'సినిమా బాగా వచ్చింది. ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. కృష్ణారెడ్డి గత చిత్రాల్లోని మ్యాజిక్‌తో పాటు మంచి మెసేజ్ ఉన్న స్క్రిప్ట్ ఇది' అని చెప్పారు.