Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంగీత దర్శకుడిగానూ ప్రయోగాలు చేస్తా..
మళ్లీ మళ్లీ వినేలా తన పాటలతో, గాత్రంతో సంగీత ప్రియులను అలరించిన గీత రచయిత, గాయకుడు, నటుడు వరంగల్ శ్రీనివాస్. ఆయన 'తారకాసురుడు' చిత్రంతో సంగీత దర్శకుడిగా ప్రస్థానం మొదలు పెడుతున్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ''మాది వరంగల్ జిల్లా తక్కెళ్ల పాడు గ్రామం. పల్లె జానపదాల బాణీలతో ప్రస్తుత సమస్యలపై సొంతంగా పాటలు రాశాను. అలా 93 అణగారిన జాతులపై పాటలు రాశాను. కమ్యూనిస్ట్, మావోయిస్ట్, సోషలిస్ట్... ప్రజా కళలను ఆకలింపు చేసుకున్నాను. తెలుగులో మాత్రమే కాదు బెంగాలీ, అస్సామీ, ఒరియా, లంబాడీ, కోయ, గొండు.. ఇలా పలు భాషల్లో కూడా ఎన్నో పాటలు రాశాను. వాటిని సొంతంగా పాడాను కూడా. దర్శకరత్న దాసరి నా ప్రతిభను గుర్తించి సినీ రచయితగా తొలి అవకాశం ఇచ్చారు. దర్శకుడు వి.సముద్ర కూడా దాసరి శిష్యుడే. తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'తారకాసురుడు' చిత్రంతో నన్ను సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ఈ సినిమాతో సంగీత దర్శకుడిగా నా ప్రస్థానం ఆరంభం కావడానికి అమ్మ ఒడిలో నేర్చుకున్న పాటే అని గర్వంగా చెప్పగలను. వచ్చే జనరేషన్ వాళ్లకు కూడా నచ్చేలా నా బాణీలు ఉంటాయి. గతంలో నేను చేసిన ఉద్యమ పాటలు, నేను పాటలు ఇచ్చిన రాజకీయ నాయకులు ఎన్నికల్లో విజయం సాధించడంతో వారికి నా పాటలపై మంచి సెంటిమెంట్ ఉంది. ఇప్పుడు సంగీత దర్శకునిగా కూడా 'తారకా సురుడు' చిత్రం కోసం పాటలకు ప్రయోగాలు చేశాను. ఈ సినిమాలోని పాటలు కచ్చితంగా హిట్ అవుతాయి. సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్న దర్శకుడు సముద్రకి కృతజ్ఞతలు' అని చెప్పారు.