Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'నాటు నాటు' పాట ఆస్కార్ బరిలో అమీతుమీ తేల్చుకోనున్న సందర్భలో ఈ సినిమా మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. అంతర్జాతీయంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే 'ది క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్'లో ఈ సినిమా బెస్ట్ యాక్షన్ సినిమాగానే కాకుండా ఇందులో నటించిన కథానాయకులు ఎన్టీఆర్, రామ్‌చరణ్ బెస్ట్ యాక్టర్స్ ఇన్ యాక్షన్ మూవీ విభాగంలో నామినేషన్లకు అర్హత సాధించారు.
ది క్రిటిక్స్ ఛాయిస్ అసోసియేషన్ రెండేళ్లుగా 'ది క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్' పేరుతో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు పురస్కారాలను అందిస్తోంది. క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ మూడో ఎడిషన్‌లో భాగంగా 'ఆర్ఆర్ఆర్' సినిమాకి బెస్ట్ యాక్షన్ మూవీ, బెస్ట్ యాక్టర్స్ ఇన్ యాక్షన్ మూవీ కేటగిరీలో రామ్ చరణ్, ఎన్టీఆర్ నామినేషన్లు అందుకున్నారు. మార్చి 16న విజేతల వివరాలను ప్రకటించనున్నారు. ఈ అవార్డుల బరిలో 'ఆర్ఆర్ఆర్' సినిమా 'బుల్లెట్ ట్రైన్', 'టాప్‌గన్ : మవరిక్', 'ది అన్బేరబుల్ వెయిట్ ఆఫ్ మాసీవ్ టాలెంట్', 'ది ఉమెన్ కింగ్' వంటి తదితర చిత్రాలతో పోటీ పడుతుండగా, ఎన్టీఆర్, రామ్‌చరణ్ సైతం బెస్ట్ యాక్టర్స్ ఇన్ యాక్షన్ మూవీ విభాగంలో నికోలస్ కేజ్, టామ్ క్రూజ్, బ్రాడ్‌పిట్ వంటి హాలీవుడ్ స్టార్‌తో అమీతుమీ తేల్చుకోనుండటం విశేషం. ఇదిలా ఉంటే, ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ వేడుక దగ్గర పడుతున్న నేపథ్యంలో 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందం ఓవర్సీస్లో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రామ్‌చరణ్ 'గుడ్ మార్నింగ్ అమెరికా' కార్యక్రమంలో పాల్గొని తెలుగు సినిమా ఘనత అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశం కావడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.