Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీనియర్ బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తి తనయుడు మిమో చక్రవర్తిని తెలుగు చిత్రసీమకు కథానాయకుడిగా పరిచయం చేస్తూ మాధవ్ కోదాడ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'నేనెక్కడున్నా'. దర్శకుడిగా ఆయనకు కూడా తొలి చిత్రమిది. ఇందులో ఎయిర్ టెల్ ఫేమ్ సశా ఛెత్రి కథానాయిక. కె.బి.ఆర్ సమర్పణలో మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు టైటిల్ వెల్లడించడంతో పాటు పోస్టర్, టీజర్‌ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇటువంటి కొత్త ప్రయత్నాలకు ప్రేక్షకుల ఆదరణ లభిస్తుంది. సినిమా విజయం సాధించాలని ఆశిస్తున్నా' అని తెలిపారు.
'జర్నలిజం, రాజకీయం నేపథ్యంలో వస్తున్న థ్రిల్లర్ చిత్రమిది. ఊహించని మలుపులతో సినిమా సాగుతుంది' అని దర్శకుడు మాధవ్ కోదాడ అన్నారు. నిర్మాత మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, 'సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. ముంబై, హైదరాబాద్, బెంగళూరులో షూటింగ్ చేశాం. ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. ప్రస్తుతం సెన్సార్ సన్నాహాల్లో ఉన్నాం. త్వరలోనే విడుదల తేదీ వివరాలు వెల్లడిస్తాం. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే చిత్రమిది' అని చెప్పారు.