Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫ్యామిలీ కథా చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి. ఆయన తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్గానిక్ మామ-హైబ్రిడ్ అల్లుడు'. కె. అచ్చిరెడ్డి సమర్పణలో అమ్ము క్రియేషన్స్, కల్పన చిత్ర పతాకంపై కోనేరు కల్పన నిర్మిస్తున్న ఈ చిత్రంలో డా. రాజేంద్రప్రసాద్, మీనా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బిగ్‌బాస్ ఫేం సోహెల్, మృణాళిని హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా మార్చి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ఈ మూవీలోని ఇతర ముఖ్య పాత్రల్లో దాదాపు సినీ పరిశ్రమలోని ప్రముఖ నటులు అందరూ నటిస్తుండటం ఓ విశేషమైతే, తన చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం వహించే కృష్ణారెడ్డి ఈ చిత్రానికి మాటలు కూడా రాయడం మరో విశేషం.
'పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఇప్పటి తరానికి కావాల్సిన అన్ని అంశాలతో ఈ చిత్రాన్ని దర్శకుడు ఎస్వీకృష్ణారెడ్డి ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఇది ఆయనకు మంచి కమ్ బ్యాక్ సినిమా అవుతుంది. ఇక ఆయన సినిమాల్లో ఉండే మ్యాజిక్, మ్యూజిక్ ఈ సినిమాలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. ఓ మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది' అని నిర్మాత కోనేరు కల్పన తెలిపారు.
సునీల్, కృష్ణభగవాన్, సన, ప్రవీణ్, సప్తగిరి, అజరుఘోష్, రాజా రవీంద్ర, సురేఖ వాణి, పృథ్వి, చలాకీ చంటి, సూర్య, రాజారవీంద్ర తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: సి. రాంప్రసాద్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: శివ, పాటలు: చంద్రబోస్, రామజోగయ్య, శ్రీమణి, నిర్మాత: కోనేరు కల్పన, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, సంగీతం, దర్శకత్వం: ఎస్వీ కృష్ణారెడ్డి.